విధాత(న్యూఢిల్లీ): కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు భారీగా పెరిగి ఆక్సిజన్ కొరతతో అల్లాడిన దేశ రాజధాని ఢిల్లి ఇప్పుడిప్పుడే ఊపరి పీల్చుకుంటోంది. ఢిల్లీలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రవాల్ ప్రకటించారు. ఢిల్లీలో చాలా రోజుల పాటు పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా ఇటీవల ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందని, గడిచిన 24 గంటల్లో 6500 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
నగరంలో పాజిటివిటీ రేటు 11 శాతానికి తగ్గింది. దేశ రాజధానిపై కరోనా వైరస్ ప్రభావం మరింత తగ్గుముఖం పట్టిందని కేజ్రవాల్ చెప్పుకొచ్చారు. కరోనా సెకండ్ వేవ్ ను అధిగమించేందుకు కేవలం 15 రోజుల్లోనే 1000 ఐసీయూ బెడ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రతి జిల్లాలో తమ ప్రభుత్వం ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంక్ ను నెలకొల్పిందని హోం ఐసోలేషన్ లో ఉన్న కొవిడ్-19 రోగులకు అక్కడి నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అవసరమైన వారికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒక్కో బ్యాంక్ లో 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉంచామని చెప్పారు.