విధాత: కరోనా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య సరఫరా చేసే నిమిత్తం.. తాజాగా మరో 66కోట్ల టీకా డోసులకు ఆర్డర్ ఇచ్చింది. సవరించిన టీకా విధానం కింద వీటిని సేకరిస్తోందని ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన టీకా ధరల ప్రకారం.. ప్రభుత్వం కొవిషీల్డ్ ఒక్కడోసుకు రూ.205, కొవాగ్జిన్ ఒక్కడోసుకు రూ.215 చెల్లించనుంది. పన్నులు కూడా కలిపితే వరుసగా రూ.215.25, రూ.225.75 చెల్లించాల్సి ఉంటుంది. అంతకుముందు ఈ రెండు టీకాలను రూ.150కే కొనుగోలు చేసేది. ఈ కొత్త విధానం కింద మొత్తం టీకా ఉత్పత్తిలో 75 శాతం డోసుల్ని కేంద్రం తయారీదారుల నుంచి సేకరిస్తోంది. ఆ తర్వాత స్టాక్‌ను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తోంది. మిగతా 25 శాతం డోసుల్ని ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలుచేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడినవారికి కేంద్రమే ఉచితంగా టీకాలు వేస్తోంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 41.69 కోట్ల టీకాలు అందించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 40కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని తెలిపింది.