97.54 శాతానికి చేరిన రికవరీ రేటు
విధాత,దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కాలంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. నిన్న 36 వేల కేసులు.. 500కు పైగా మరణాలు సంభవించాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజాగా 18,86,271 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 36,571 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒక్క కేరళలోనే 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 540 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో, మొత్తం కేసులు 3.23 కోట్లకు చేరగా.. 4,33,589 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం 3.63లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.12 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.54 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 36 వేల మంది కోలుకోగా.. మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 3.15 కోట్లుగా ఉంది.
57 కోట్ల టీకా డోసుల పంపిణీ:
జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం ఈ మధ్య వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 57 కోట్ల మార్కును దాటింది. నిన్న 54.7లక్షల మంది టీకా వేయించుకున్నారు.