Site icon vidhaatha

సీపీఐ ఆఫీస్ నుంచి ఏసీ ని తీసుకెళ్లిన క‌న్హ‌య్య‌ కుమార్

విధాత‌: జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియ‌న్ మాజీ అధ్య‌క్షుడు క‌న్హ‌య్య కుమార్ మంగ‌ళ‌వారం కాంగ్రెస్‌లో చేర‌బోతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) బీహార్ కార్య‌ద‌ర్శి రామ్ న‌రేష్ పాండే ఆస‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డించారు. కొన్ని రోజుల కింద‌ట బీహార్ రాజ‌ధాని పాట్నాలోని సీపీఐ ఆఫీస్‌లో తాను ఏర్పాటు చేసిన ఏసీని క‌న్హ‌య్య తీసుకెళ్లార‌ని రామ్ న‌రేష్ చెప్పారు. ఆయ‌న త‌న ఖ‌ర్చుతో ఆ ఏసీని ఏర్పాటు చేశార‌ని, అందుకే దానిని తీసుకెళ్ల‌డానికి తాను అనుమ‌తించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే క‌న్హ‌య్య కాంగ్రెస్‌లో చేర‌బోర‌ని ఇప్ప‌టికీ తాను భావిస్తున్న‌ట్లు రామ్‌న‌రేష్ అన్నారు. ఆయ‌న మైండ్‌సెట్ ఓ కమ్యూనిస్ట్‌ది. అలాంటి వ్య‌క్తులు త‌మ సిద్ధాంతాల‌కు క‌ట్టుబడి ఉంటారు అని రామ్ న‌రేష్ చెప్పారు.

ఈ నెల 4, 5 తేదీల్లో జ‌రిగిన సీపీఐ నేష‌న‌ల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ క‌న్హ‌య్య పాల్గొన్నార‌ని తెలిపారు. అప్పుడు కూడా క‌న్హ‌య్య పార్టీని వీడుతున్న‌ట్లు చెప్ప‌లేద‌ని, పార్టీలో ఎలాంటి ప‌ద‌వీ ఆశించ‌లేద‌ని రామ్ న‌రేష్ చెప్పారు. క‌న్హ‌య్య కుమార్‌తోపాటు గుజ‌రాత్‌లోని రాష్ట్రీయ ద‌ళిత్ అధికార్ మంచ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మంగ‌ళ‌వారం కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Exit mobile version