విధాత: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. దిల్లీలో అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి కీలక నేతలంతా చేరుకున్నారు.
ఈ భేటీలో పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్ పరిణామాలపై ఇటీవల జీ-23గా పేర్కొనే కాంగ్రెస్ అసమ్మతి వర్గానికి చెందిన పలువురు అధిష్ఠానంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. సీడబ్ల్యూసీ భేటీ గురించి పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుతం సోనియా గాంధీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఎప్పటి నుంచో పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలను రాహుల్‌కు అప్పగించాలని కొందరు కోరుతున్నారు. దీంతో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే, కొత్త అధ్యక్షుడి ఎంపికకు మధ్యంతర ఎన్నికలకు బదులు.. పూర్తి స్థాయి సంస్థాగత ఎన్నికలే నిర్వహించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై నేటి భేటీలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పంజాబ్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని ఈ సందర్భంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.