విధాత:ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపు, ఆయుష్ మిషన్ పొడగింపు వంటి కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.దాదాపు ఏడాది కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రత్యేక్షంగా జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న మరిన్ని నిర్ణయాల వివరాలు ఇలా ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) 17 నుంచి 28 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏ, డీఆర్లు జులై 1 నుంచే అమలులోకి రానున్నాయి.
ఈ నిర్ణయంతో 48.34 లక్షల ఉద్యోగులకు, 65.26 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
పెంచిన డీఏ, డీఆర్ వల్ల కేంద్రంపై రూ.34,401 కోట్ల అదనపు భారం పడనుంది.
పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది.
ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన భేటీలో డీఏ, డీఆర్ పెంపు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్.
కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాది తర్వాత కేబినెట్ ప్రత్యక్షంగా సమావేశమవడం గమనార్హం.