భీమా కోరేగాం కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.
విధాత: ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు. 84 ఏళ్ల స్టాన్ స్వామి ఏడు నెలలుగా ముంబాయి జైల్లో ఉన్నారు. నీళ్ల గ్లాసు కూడా గట్టిగా పట్టుకోలేని ఈ పెద్దాయనకు రెండు సార్లు బెయిల్ నిరాకరించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ చివరికి కరోనా బారిన కూడా పడ్డారు. ఆయనకు చాలా రోజులుగా కరోనా లక్షణాలున్నా పరీక్ష చేయలేదని, చివరికి జూన్ 30న ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిందని సమాచారం. ఆయన ప్రాణాలు రక్షించడానికి సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకొమ్మని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఫాదర్ స్టాన్ స్వామి బెయిల్ పిటిషన్ విచారిస్తూ మే 21 నాడు ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందించమని కోర్టు ఆదేశించినప్పుడు, వాళ్లిచ్చే వైద్యం ఎంత నిష్ప్రయోజనమో చెబుతూ ఆ ట్రీట్మెంట్ బదులు జైల్లోనే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
స్టాన్ స్వామి ఝార్ఖండ్ కు చెందిన ఒక ఆదివాసీ హక్కుల కార్యకర్త. అక్కడి పౌరసమాజమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను ఎంతో గౌరవిస్తుంది. స్వయంగా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి ఆయన విడుదలకు డిమాండ్ చేశాడు.
ఝార్ఖండ్ జనాధికార్ మహాసభ స్టాన్ స్వామి ప్రస్తుత స్థితి పట్ల స్పందిస్తూ “స్టాన్ స్వామి కాదు, భారత ప్రజాస్వామ్యం వెంటిలేటర్ మీదుంది అని ప్రకటించింది. నిజమే కదా!