జనవాక్యం: భూమి రికార్డులకు సంబంధించి వివాదాలు నడిచేది ఎప్పుడూ రెండు శాతం లోపే.. రిజిష్ట్రేషన్,మ్యుటేషన్, పాసు పుస్తకం జారీ అన్నీ ఏక కాలంలో పూర్తి చేసే ప్రక్రియను ప్రవేశపెట్టడం గొప్ప సంస్కరణే. ఈ ప్రక్రియ పూర్తి కావడా నికి గతంలో కాలయాపన జరిగేది. ఇప్పుడా సమస్య పోయింది. కానీ సమస్యల్లా భూరికార్డుల వివాదాల సులభమైన పరిష్కారానికి ఏర్పాటు లేకపోవడమే ఈ చట్టంలో ప్రధాన లోపం.
వాస్తవానికి భూరికార్డులు పల్లెల్లో ప్రజలకు దగ్గరగా ఉండేవి. ఎన్టీ రామారావు మండల వ్యవస్థను తెస్తూ పట్వారీ వ్యవస్థ ను రద్దు చేశారు. భూ రికార్డులను మండల రెవెన్యూ అధికారుల చేతికి తీసుకు వచ్చారు. గ్రామాల స్థాయిలో నాలుగైదు గ్రామాలకు కలిపి కనీస అవగాహన లేని వీఆర్వో, వీఆర్యేలను నియమించారు. వారు రికార్డులను అడ్డగోలుగా తారు మారు చేశారు. అయినా ఎక్కడైనా తేడావస్తే మండల ఆఫీసుకు వెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉండేది. అక్కడా పరిష్కారం కాకపోతే ఆర్డీవో, ఆ తర్వాత జాయింటు కలెక్టరు దాకా వెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉండేది.
ఇప్పుడు అటువంటి వెసులుబాటు ఏదీ లేకుండా ధరణిని తీసుకొచ్చారు. భూరికార్డులలో తప్పులకు ప్రభుత్వ సిబ్బంది పై చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా చట్టం తెచ్చారు. ఇప్పుడు కలెక్టరు ఒక్కరే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. ఒక జిల్లాలో గతంలో 30 నుంచి 50 మంది అధికారులు చేసిన పని ఇప్పుడు కలెక్టరు ఒక్కరే చేయాలి. దీంతో కలెక్టర్లకు పనిభారం పెరిగింది. అధికారాలు పెరిగాయి. కొందరు కలెక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్డీవోలకు, అదనపు కలెక్టర్లకు ఇప్పుడు తగినంత పనిలేదు.
రైతులు తమ భూమి రికార్డుల సమస్యను పరిష్కరించుకోవడం కోసం నెలల తరబడి ఎదురు చూడవలసిన పరిస్ఠితి. సామాన్యులెవరికీ కలెక్టరు అపాయింటుమెంటు కూడా దొరకదు. ఏమన్నా అంటే మీసేవలో దరకాస్తు చేసకొమ్మని చెబు తారు. గోడలతో మాట్లాడినట్టు ఉంది వ్యవహారం. లిఖిత పూర్వక రికార్డులను నిర్వహించిన కాలంలోనే ఏ పత్రాలూ లేకుండా భూమి యజమానులు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు కంప్యూటరు వచ్చిన తర్వాత భూమి రికార్డులు తారుమారైతే సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ధరణిని ఇప్పటికయినా సంస్కరించాలి. సరళమైన పరిష్కార వేదికలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ధరణిలో మార్పులు తేవాలి. తహసీల్దారు స్థాయిలో లేక మండల స్థాయిలో పరిష్కరించుకునే ఏర్పాటు జరగాలి. అటువం టి ఏర్పాటు జరుగనంతకాలం ధరణి చుదువుకున్నోళ్లు, సంపన్నులకు మాత్రమే ఉపయోగపడే సాధనమవుతుంది.
-రేచర్ల రామిరెడ్డి, మహబూబ్ నగర్