Site icon vidhaatha

దేశం ముందు గ‌తుకుల మార్గం క‌నిపిస్తుంది

విధాత‌:దేశం ముందు గతుకుల మార్గం కనిపిస్తోందని, అందువల్ల ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన సమయం అసన్నమయిందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 1991లో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే సరళీకరణ విధానాలు, సంస్కరణలకు రూపకల్పన జరిగింది. ‘‘ఇది సంతోషించాల్సిన సందర్భం కాదు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం. 1991 నాటి సంక్షోభం కన్నా ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రతి ఒక్క భారతీయుడు ఆరోగ్యం, గౌరవంతో బతికే విధంగా ప్రాధాన్యతలను మార్చుకోవాల్సి ఉంది. 30 ఏళ్ల కిత్రం ఇదే రోజున కాంగ్రెస్‌ పార్టీ కీలకమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టి, నూతన దారిని ఏర్పాటు చేసింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఈ మార్గాన్నే అనుసరించాయి. దాంతో దేశం మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధమయింది. అన్నింటికన్నా ముఖ్యంగా 30 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. యువతకు కోట్లాది ఉద్యోగాలు వచ్చాయి. స్వేచ్ఛాయుత వ్యాపారానికి ప్రోత్సాహం లభించడంతో ప్రపంచస్థాయి కంపెనీలు వచ్చాయి. దాంతో చాలా రంగాల్లో భారత్‌ ప్రపంచస్థాయి శక్తిగా ఎదిగింది. దేశ ఆర్థిక రంగం సాధించిన ప్రగతికి గర్వపడుతున్నా కరోనా కారణంగా కోట్లాది మంది నష్టపోవడం విచారం కలిగిస్తోంది. ఆర్థిక వృద్ధికి అనుగుణంగా వైద్య, విద్యా రంగాలు ప్రగతి సాధించకపోవడం దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు.

Exit mobile version