విధాత: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. బసవరాజ్ బొమ్మాయ్ సీఎం కావడంతో తండ్రీ, కొడుకులు సీఎంగా చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. కొత్త ముఖ్యమంత్రి తండ్రి సోమప్ప రాయప్ప బొమ్మాయ్ 1996-98లో కర్ణాటక సీఎంగా పనిచేశారు. సీఎంలుగా పనిచేసిన తండ్రుల బాటలో కుమారులు పయనించి వారు కూడా మళ్లీ ముఖ్యమంత్రి పీఠాలను అధిరోహించి రికార్డు సృష్టించారు. తమిళనాడు రాష్ట్రంలో ఎం కరుణానిధి 1969-2011 సంవత్సరాల మధ్య ఐదు సార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడు సీఎం పీఠాన్ని కైవసం చేసుకొని తండ్రి కరుణానిధి బాటలో పయనించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. అతని కుమారుడు జగన్ మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యారు. గతంలో ఏపీ సీఎంగా ఎన్టీరామారావు పనిచేయగా, అతని బాటలో పయనించిన ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబునాయుడు సీఎం పదవి చేపట్టారు. ఒడిశా సీఎంగా తండ్రి బిజు పట్నాయక్ రెండుసార్లు పనిచేశారు. బిజూ కుమారుడు నవీన్ పట్నాయక్ ఐదు పర్యాయాలు సీఎం అయ్యారు. జార్ఖండ్ సీఎంగా షిబూ సోరెన్ మూడు సార్లు పనిచేయగా అతని కుమారుడు హేమంత్ సోరెన్ రెండవసారి సీఎం అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ లో తండ్రి డోర్జీ ఖండు, పెమాఖండులు సీఎంలుగా పనిచేశారు.