2న బీజేపీలో చేరేందుకు సిద్ధం?
విధాత,న్యూఢిల్లీ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్ తుగ్, మాజీ ఎంపీ వివేక్, ఏనుగు రవీందర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈటల బీజేపీలో చేరిక, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై వారు చర్చించే అవకాశం ఉంది.
కాగా, టీఆర్‌ఎస్ స్థాపించిన తరువాత తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేసీఆర్ వెంట నడిచిన కొద్ది మందిలో ఈటల ఒకరు. బీసీ నాయకుడిగా పార్టీలో అనతికాలంలోనే ఎదిగిన ఆయన కేసీఆర్‌కు నమ్మిన వ్యక్తిగా ప్రతి కీలక ఘట్టంలో కొనసాగారు. 2014లో తెలంగాణ సిద్ధించి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన తొలి కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా కీలక మంత్రి పదవిని చేపట్టారు. 2018లో రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధినేతతో పెరుగుతూ వచ్చిన దూరం చివరకు మంత్రి పదవి నుంచి తొలగించేంత వరకూ వెళ్లింది. పార్టీతో ఆయనకున్న రెండు దశాబ్దాల అనుబంధం బీటలు వారింది. ఇక కాషాయ జెండాతో కొత్త అవతారంలోకి మారనున్నారు. అదే సమయంలో జిల్లాలో రాజకీయాలు కూడా మారనున్నాయి.