న్యూఢిల్లీ: రాబోయే 5 రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చెరి, కేరళ కూడా ఉన్నాయి. బుధవారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మిగిలిన నాలుగు రోజులు కూడా మన రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురవనున్నాయి.
కరీంనగర్: అసైన్డ్ భూమిని తాను కొన్నానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. లేకపోతే సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అహంకారానికి, దుర్మార్గానికి ఘోరీ కట్టడం దగ్గరలో ఉందని చెప్పారు. తాను రాజీనామా చెయ్యలేదని, తనను పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు. మంత్రి పదవి పోతే పోయిందని ఎమ్మెల్యేకు మాత్రం రాజీనామా చెయ్యకు బిడ్డా అని అందరూ చెప్పారని తెలిపారు. ఇజ్జత్ ఉన్నొన్ని కాబట్టి ఎమ్మెల్యేకు రాజీనామా చేశానని ఈటల తెలిపారు.