4.11లక్షల క్రియాశీల కేసులు
విధాత,దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 39 వేల కేసులు వెలుగుచూశాయి. ఆదివారం 11,54,444 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 39,361 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక మరణాల సంఖ్య దాదాపు 400కు దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో 416 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 4,20,967కి చేరింది.
ఇక నిన్న 35,968 మంది కోలుకున్నారు.మొత్తం కేసులు 3.14 కోట్లకు చేరగా.. 3.05కోట్ల మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల రేటు 1.31కి చేరగా.. రికవరీ రేటు 97.35 శాతంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కేరళలో కొత్త కేసులు భారీగా వెలుగుచూశాయి. అక్కడ 17,466 మందికి వైరస్ సోకింది. మహారాష్ట్రలో 6,843 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.నిన్న దేశవ్యాప్తంగా 18.99లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన టీకా డోసులు 43.51,96,001గా ఉన్నాయి.