విధాత(కోల్‌కత): కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నాయి. కర్ణాటకలో అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉన్నది. లాక్‌డౌన్ విధించడం వల్ల కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుతున్నాయని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఆర్. అశోక అన్నారు.
లాక్‌డౌన్‌కు ముందు బెంగళూరులో ప్రతిరోజు 25 వేలకుపైగా కేసులు నమోదవగా, ఆంక్షలు అమలుచేయడం వల్ల ప్రస్తుతం అవి 17 వేలకు తగ్గాయని చెప్పారు. మరోమారు లాక్‌డౌన్‌ను పొడిగించడం వల్ల కేసులు తక్కువైతాయని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 24తో ముగుస్తుందని, దానికి ఒక రోజుముందు మంత్రిమండలి సమావేశమవనుందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించి లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించింది. ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్ కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్ పొడిగింపుపై మార్గదర్శకాలను మరికొద్దిసేపట్లో ప్రభుత్వం జారీ చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం నెలకొంది. కరోనా బారినపడి ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కన్నుమూశారు. ఆషీమ్ బెనర్జీ కోల్‌కతాలోని మెడికా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు.