ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ చమురు, గ్యాస్ బావుల అమ్మకానికి ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. గుజరాత్‌లోని ఆన్‌షోన్ చమురు బావులతో పాటు, పశ్చిమ తీరంలోని పన్న-ముక్త, రత్న క్షేత్రాలను ప్రైవేట్ కంపెనీలకు అమ్మేయడం మంచిదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. ఆ మంత్రిత్వ శాఖ ఓఎన్‌జీసీ సీఎండీ సుభాష్ కుమార్‌కు ఈ మేరకు ఒక లేఖ రాసింది. ఓఎన్‌జీసీకి ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలోని కేజీ బేసిన్‌లో ఉన్న గ్యాస్ క్షేత్రాల్లో విదేశీ సంస్థల భాగస్వామ్యం కోసం ప్రయత్నించాలని కోరింది. దీనికి తోడు చమురు, గ్యాస్ బావుల తవ్వకం, నిర్వహణ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయడం మంచిదని సూచించింది. ఈ లేఖపై ఓఎన్‌జీసీ ఇంకా స్పందించాల్సి ఉంది.