Site icon vidhaatha

పవన్ కళ్యాణ్‌కి కేంద్రమంత్రి పదవి?!

ఆర్ఎస్ఎస్- బీజేపీ మాస్టర్ ప్లాన్..

విధాత:ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా బలపడాలని యోచిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల తిరుపతి ఉ‌‌పఎన్నికల ఫలితంతో ఏపీలో గెలుపు అంత సులువు కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. ఏపీ నుంచి కీలక నేతల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతుండగా… మోదీ కేబినెట్లో ఏపీ నుంచి ఒక్కరూ కూడా లేరు. దీంతో ఆ లోటును భర్తీ చేసి ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి ఒక్క లోక్‌సభ సభ్యుడు కూడా లేరు.సురేష్ ప్రభు బీజేపీ తరపు రాజ్యసభను ఎన్నిక కాగా.. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ టీడీపీ నుంచి ఎన్నికై బీజేపీ సభ్యులుగా కొనసాగుతున్నారు. మరోవైపు ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికలు, తిరుపతి ఉప‌ఎన్నిక సమయంలో జనసేన పోటీ విరమించుకుని బీజేపీకి అండగా నిలిచింది. దీనిపై జనసేన కేడర్‌లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు పవన్‌ కళ్యాణ్‌‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తే ఏపీతో పాటు తెలంగాణలోనూ బీజేపీకి ప్రయోజనం ఉంటుందని బీజేపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. ఏపీలో జగన్‌ను ఎదుర్కోవాలంటే జనాకర్షణ కలిగిన నేత అవసరమని, అందుకే పవన్‌కు కేంద్ర మంత్రి ఇవ్వటం అవసరమని ఆర్ఎస్ఎస్‌లో కీలకంగా వ్యవహరించే ఓ ముఖ్య నేత బీజేపీ అధినాయకత్వం వద్ద ప్రస్తావించినట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్‌కు కేంద్రమంత్రి ఇవ్వడం ఖాయమంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Exit mobile version