Site icon vidhaatha

ఆఫ్ఘనిస్తాన్‌ ఘర్షణల్లో ఫోటో జర‍్నలిస్టు మృతి

విధాత,కాందహార్: ఆఫ్ఘనిస్తాన్‌ ఘర్షణల్లో భారతీయ ఫోటో జర్నలిస్టు సిద్దిఖి అహ్మద్ డానిష్‌ దుర్మరణం పాలయ్యారు. కందహార్ నగరంలోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో సిద్దిఖీ మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ రాయబారి శుక్రవారం తెలిపారు. సిద్ధిఖి మరణం తీవ్ర విచారకరమని రాయబారి ఫరీద్ మముండ్జాయ్ ప్రకటించారు.
పులిట్జర్ బహుమతి గ్రహీత రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఆకస్మికమరణంపై పలువురు జర్నలిస్టులు, ఇతర మీడియా మితత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానంటూ ట్వీట్‌ చేసిన మూడురోజుల్లోనే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది. ఈ సందర్బంగా ట్విటర్‌ వేదికగా సిద్ధిఖీ గతంలో అందించిన కథనాలు, షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
కాగా డానిష్ సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించి, తరువాత ఫోటో జర్నలిస్టుగా మారారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ఫోటో జర్నలిస్ట్‌గా ఉన్నారు. అలాగే ఇండియాటుడే గ్రూప్‌లో కొంతకాలం కరస్పాండెంట్‌గా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభ సమయాలను అతి సాహసోపేతంగా కవర్ చేసిన ఘనత సిద్ధిఖీ సొంతం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం, నేపాల్ భూకంపాలు, హాంకాంగ్ నిరసనలు మొదలైనవాటిని కవర్ చేశారు. శ్రీలంక పేలుళ్ల సమయంలో పోలీసు కేసును కూడా సిద్ధిఖీ ఎదుర్కొన్నారు.

Exit mobile version