Site icon vidhaatha

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ నియామకం

విధాత,న్యూఢిల్లీ : పంజాబ్ గొడవకు కాంగ్రెస్ అధిష్ఠానం పుల్ స్టాప్ పెట్టేసింది.అసంతృప్త నేత సిద్దూకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది.ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ కొనసాగుతారని, అయితే పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్దూ బాధ్యతలు చేపడతారని పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జీ హరీశ్ రావత్ ప్రకటించారు.మరో రెండు రోజుల్లో అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం తమతో అన్నారని రావత్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని, అందులో సందేహమే లేదని రావత్ స్పష్టం చేశారు. ‘‘రాష్ట్యానికి భవిష్యత్తు సిద్దూ. ఏ విషయం మాట్లాడినా, అభిప్రాయాలు చెప్పినా, ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలి’’ అని రావత్ సుతిమెత్తగా హెచ్చరించారు. సీఎం అమరీందర్‌కు, సిద్దూకు అస్సలు పొసగదు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాతనైనా సిద్దూ సీఎంతో సఖ్యతగా ఉంటారా? లేక ఇదే స్థాయిలో అసంతృప్త స్వరాన్ని వినిపిస్తారా? అన్నది ఆసక్తిదాయకం.

Exit mobile version