విధాత,న్యూ ఢిల్లీ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్యపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు స్పందించారు. రోడ్ల మూసివేత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్‌కు ఉపరాష్ట్రపతి సూచించారు. రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజయ్ భట్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యను అజయ్ భట్ దృష్టికి వెంకయ్యనాయుడు తీసుకెళ్లారు. రోడ్లు మూసివేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని అజయ్ భట్‌కు సూచించారు.
ఈ సమస్యకు సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అజయ్ భట్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ బోర్డుతో సంబంధం లేకుండా లోకల్ మిలిటరీ అథారిటీ రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని.. కంటోన్మెంట్ యాక్ట్ సెక్షన్-258కి ఇది పూర్తి విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.
సికింద్రాబాద్ లోకల్ మిలిటరీ అథారిటీ పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్డును కొవిడ్ నిబంధనలు కారణంగా చూపించి మూసేస్తున్నారన్నారు. నిబంధనల పేరుతో రోడ్లను మూసివేయటం వల్ల లక్షలాది మంది నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ రాశారు. తాజాగా ఇదే విషయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ సమస్యను పరిష్కరించాలని అజయ్ భట్‌కు సూచించారు.