విధాత:ప్రకాశంజిల్లా పెద్దారవీడు మండలం, రాజంపల్లి చెంచు గూడెంలోని గిరిజన పాఠశాల, అంగనవాడి కేంద్రం, కమ్యూనిటీ హాల్ నిర్మాణంకోసం. కేటాయించిన స్థలాన్ని కబ్జాచేసి అక్రమంగా చర్చి నిర్మించడానికి కొందరు స్థానికులు ప్రయత్నించగా అడ్డుకున్నారనే అక్కసుతో చేసిన దాడుల్లో నిందితులపై ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదుచేయాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. రాజంపల్లి చెంచుగూడేన్ని సోము వీర్రాజు ఆధ్వర్యంలో భాజపా బృందం ఆదివారం సందర్శించింది. దుండగుల దాడిలో జల్లా సాయి, జల్లా సీతారామయ్య, జిల్లా వెంకటేశ్వర్లు, జల్లా ఆదిలక్ష్మిలను పరామర్శించారు. నిందితులపై ఎస్టీ అత్యాచార నిరోధక కేసును నమోదు చేసి 307 సెక్షన్ కట్టాల్సి వుండగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని బాధితులు తెలిపారు. సంఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నా ఎలాంటి విచారణ పోలీసులు చేపట్టలేదని వాపోయారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ, డిఎస్పీలతో మాట్లాడి హత్యాయత్నం జరిగితే బెయిలబుల్ సెక్షన్లు ఎలా పెడతారని నిలదీశారు. సెక్షన్లు మార్చి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే భాజపా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందన్నారు. నేషనల్ ఎస్టీ కమీషన్కి మీపై పిర్యాదు చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షులు సిరసనగండ్ల శ్రీను, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుమల్ల వంశీకృష్ణ, నాయకత్వం వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆమని వసుంధర, బి. వెంకటేశ్వర నాయక్, నరసరావుపేట పార్లమెంట్ గిరిజన మోర్చా ఇంచార్జీ పొన్నర్స్ సుబ్బారావు, ప్రకాశం జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు కొమరగిరి ఏడుకొండలు, ప్రధానకార్యదర్శి ఏలూరి శ్రీనివాసులు, రెబడు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కెం కోటయ్య, ప్రెసిడెంట్ జాళ్ళా రామారావు తదితరులు పాల్గొన్నారు.