విధాత,దిల్లీ: కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అంతేగాక, కొవిడ్‌తో చనిపోయినవారి మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఏకరీతి విధానం అవలంబిస్తున్నారా లేదా అని ప్రశ్నించింది.
విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద కరోనాతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. లక్ష చొప్పున నష్టపరిహారం ఇచ్చేలా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. కొవిడ్‌తో చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రాలను ఎలా జారీ చేస్తున్నారని ధర్మాసనం అడిగింది.
వాటి జారీలో ఏకరీతి విధానాన్ని పాటించకపోతే..ఒకవేళ నష్టపరిహారం ప్రకటించినా అది మృతుల కుటుంబాలకు చేరదని పేర్కొంది.డెత్ సర్టిఫికెట్ల జారీలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసిన ధర్మాసనం.. అప్పటిలోగా కేంద్రం తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది.