విధాత,హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఇకపై పర్యావరణ అనుకూలమైన సంచీల్లో లభించనుంది. నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పట్టే ప్లాస్టిక్ స్థానంలో కేవలం కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీ (ఎకొలాస్టిక్)లు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్ రామ్‌మనోహర్‌బాబు వెల్లడించారు. ప్రమాదకర సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ సహకారం, నాగార్జున విశ్వవిద్యాలయం, డీఆర్‌డీవోతో కలసి హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఎకొలాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల (ఎకొలాస్టిక్)ను చర్లపల్లి పారిశ్రామికవాడలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్‌మనోహర్‌బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ బదులుగా వాడి పడేసిన కొన్ని నెలలకే సురక్షితం గా, సంపూర్ణంగా నాశనమయ్యే ఎకొలాస్టిక్ వంటి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్‌ను వాడటం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్నారు.