Site icon vidhaatha

కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ అరెస్ట్‌

విధాత: లఖింపుర్‌ కేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా అరెస్టయ్యారు. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు శనివారం రాత్రి 11 గంటలకు ఆశిష్‌ మిశ్రాను అరెస్టు చేశారు. ఈ నెల 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. ఇందులో భాగంగా ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి ఆశిష్‌ మిశ్రా విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే శుక్రవారమే అతడు పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయాడని ఆయన తండ్రి అజయ్‌ మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం క్రైం బ్రాంచ్‌ పోలీసుల ఎదుట ఆశిష్‌ హాజరయ్యారు. దీంతో పోలీసులు అశిష్‌ మిశ్రాను 11 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్‌ చేశారు. అయితే విచారణలో ఆశిష్‌ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు. మేం అడిగిన ప్రశ్నలకు అతను సరైన సమాధానాలు ఇవ్వలేదన్నారు. ఆశిష్‌ మిశ్రాను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

Exit mobile version