దాని తర్వాతా జాగ్రత్తలు పాటించాల్సిందే..నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్
విధాత,డిల్లీ: కొవిడ్-19 నుంచి వ్యాక్సిన్లు 100% రక్షణ కల్పించలేవని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. అయితే తీవ్రతను తగ్గిస్తాయని అన్నారు. అందుకే టీకా వేసుకున్నా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు యాంటీబాడీ టెస్ట్‌లు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తొలి డోసు ఒక సంస్థది, రెండో డోసు ఇంకో సంస్థది తీసుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల 20 మంది లబ్ధిదారులకు రెండు వేర్వేరు సంస్థలకు చెందిన డోసులిచ్చిన విషయం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘వేర్వేరు కంపెనీల డోసులు తీసుకున్నా ప్రతికూల ప్రభావాలేమీ ఉండవు. అయితే దీనిపై శాస్త్రీయంగా బలమైన అభిప్రాయానికి రావడానికి మరిన్ని అధ్యయనాలు, ఆధారాలు రావాల్సి ఉంది. ఒకవేళ ఇప్పటికే ఇలా జరిగిపోయినప్పటికీ ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ప్రస్తుత ప్రొటోకాల్స్ ప్రకారం రెండు డోసులూ ఒకే సంస్థవి ఇవ్వాలి. వైద్యసిబ్బంది వాటిని కచ్చితంగా పాటించాలి’’ అన్నారు.
కొందరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీలు ఏమీ ఉత్పత్తి కావడం లేదంటున్నారన్న ప్రశ్నకు వీకేపాల్ బదులిస్తూ ‘‘వ్యాక్సిన్ తీసుకున్నవారు యాంటీబాడీ పరీక్షలు చేయించుకోనక్కర్లేదు. రోగనిరోధశక్తి కొలవడానికి యాంటీబాడీ టెస్ట్ ఒక కొలమానం మాత్రమే. అదే ఏకైక కొలమానం కాదు. మాధ్యమిక, దీర్ఘకాలంలో సెల్‌మీడియేటెడ్ రెస్పాన్స్ అన్నది చాలా ముఖ్యం. శరీరంలోకి వైరస్ జొరబడినప్పుడు మొత్తం రోగనిరోధక వ్యవస్థను ఇది అప్రమత్తం చేస్తుంది. ఆ టెస్ట్ చేయించుకోవడం ముఖ్యం. యాంటీబాడీలు కనిపించినా కనిపించకపోయినా వ్యాక్సిన్ తీసుకున్న అందరిలో రోగనిరోధశక్తి పెరుగుతుంది. వ్యక్తులను బట్టి ఇందులో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మొత్తంగా అందరికీ సామాజికంగా, వ్యక్తిగతంగా రక్షణ ఉంటుంది. రెండు డోసులు తీసుకున్నవారికి తర్వాతి కాలంలో బూస్టర్ డోస్ అవసరమైతే అది ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై ప్రస్తుతం పరీక్షలు నడుస్తున్నాయి. దీన్ని ఆరు నెలల తర్వాత ఇవ్వాలా లేదంటే ఇంకా ఆలస్యంగానా? అన్నదానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.