Site icon vidhaatha

మనందరి టార్గెట్‌ 2024.. విపక్ష నేతలతో భేటీలో సోనియా

విధాత,న్యూ ఢిల్లీ:వచ్చే సార్వత్రిక ఎన్నికలే మనందరి లక్ష్యం కావాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రణాళికా బద్ధంగా పనిచేయాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ఉద్దేశంతో 19 రాజకీయ పార్టీల నేతలతో శుక్రవారం సోనియా వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రే, స్టాలిన్‌ వంటి కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.

టీఎంసీ,ఎన్సీపీ,డీఎంకే,శివసేన, జేఎంఎం,సీపీఐ, సీపీఎం,ఎన్సీ,ఆర్జేడీ, ఏఐయూడీఎఫ్‌, వీసీకే, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌, జేడీఎస్‌, ఆర్‌ఎల్డీ, ఆర్‌ఎస్పీ, కేరళ కాంగ్రెస్‌ (మణి), పీడీపీ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఆమ్‌ ఆద్మీ, బీఎస్పీ, ఎస్పీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.
ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ మనందరి లక్ష్యం 2024 ఎన్నికలు కావాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర ఉద్యమ విలువలు,రాజ్యాంగ సూత్రాలు, నియమాల పట్ల విశ్వాసం ఉంచే ప్రభుత్వాన్ని దేశానికి అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఒక విధంగా ఇది సవాల్‌తో కూడుకున్నదే అని అన్నారు. ప్రత్యామ్నాయం లేని స్థితిలో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పారు. దేశం కోసం ఒకే వేదికపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. భారత 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేళ వ్యక్తిగతంగా, సమష్టిగా పునః పరిశీలనకు ఇదే సరైన సమయం అని చెప్పారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, వ్యవసాయ చట్టాల వంటి అంశాలపై ఉమ్మడిగా ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే, ఓబీసీ బిల్లు విషయంలో అన్ని పార్టీలు ఒక్కటి తాటిపైకి వచ్చినట్లుగానే పార్లమెంట్‌ వెలుపల కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని సోనియా పిలుపునిచ్చారు.

Exit mobile version