BRS | బీఆరెస్‌కు పార్టీ ‘ఫిరాయింపుల’ భయం

తమ పార్టీ బీఆరెస్ నేత కేసీఆర్ వెంటే ఉంటా... పార్టీ మారే ప్రసక్తేలేదు... ఆరునూరైనా బీఆరెస్ లోనే కొనసాగుతాను... నేను పార్టీ మారుతున్నానని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

  • Publish Date - June 14, 2024 / 05:55 PM IST

నేతల పైన అనుమానపు చూపులు
పార్టీ మారుతున్నారనే ప్రచారం షురూ
వివరణ ఇచ్చుకుంటున్న ముఖ్యనేతలు
అదునుచూసి పార్టీ మార్పుకు సిద్ధం
బీఆరెస్ పార్టీలో దయనీయ పరిస్థితి
సవాల్ గా మారిన నాయకులు, కేడర్ రక్షణ

విధాత ప్రత్యేక ప్రతినిధి: తమ పార్టీ బీఆరెస్ నేత కేసీఆర్ వెంటే ఉంటా… పార్టీ మారే ప్రసక్తేలేదు… ఆరునూరైనా బీఆరెస్ లోనే కొనసాగుతాను… నేను పార్టీ మారుతున్నానని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.. వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను…. కావాలని కొందరు చేస్తున్న దుష్ప్రచారం అంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆరెస్ నేత, కేసీఆర్ కు సన్నిహితునిగా చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ఇలాంటి ప్రకటన చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి పార్టీ మారుతున్నారనే ప్రచారం తిరిగి ప్రారంభం కావడంతో ఆయన పై విధంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ఎర్రబెల్లి పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మారడంలేదని చెప్పారు. కేసీఆర్ ను ఎందుకు ఓడించామా అని ప్రజలు బాదపడుతున్నారు.. ప్రస్తుత పాలకుల అసమర్ధపాలనపై ఆగ్రహంగా ఉన్నారంటూ రేవంత్ పై విరుచుకపడ్డారు. ప్రజల పక్షాన నిలిచి బలమైన ప్రతిపక్షపాత్ర పోషిస్తాం.. తెలంగాణ ప్రజలకు మేలుజరిగేలా ఉద్యమిస్తామంటూ చెబుతూ వచ్చారు. తాజాగా మరోసారి ఇంత ఘాటుగా స్పందించకపోయినప్పటికీ పార్టీ మారేదిలేదని మాత్రం చెబుతూ వచ్చారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాగానీ పార్టీ మారనంటూ చెప్పారు.

పార్లమెంటు ఎన్నికల ఓటమి నేపథ్యంలో బీఆరెస్ నేతల స్వరంలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది.పార్లమెంటు ఎన్నికలకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సైతం తాను పార్టీ మారే ప్రసక్తేలేదంటూ ప్రకటించారు. ఇలాంటి స్టేట్ మెంట్లు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకు వచ్చాయి. తాజాగా పార్లమెంటు ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకు ఈ వివరణలు, స్టేట్ మెంట్లు ఇచ్చుకునే పరిస్థితి బీఆరెస్ పార్టీలో తిరిగి ప్రారంభమైంది. ఈ జాబితాలో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. ఎవరు ఉంటారో? ఎవరు వీడుతారో? అనే పరిస్థితి నెలకొంది.

అధికారం కోల్పోవడంతో ఈ దుస్థితి

బీఆరెస్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులపై పెరిగిన అనుమానపు చూపులు, ప్రచారం మళ్ళీ కొత్తగా షురూ అయ్యాయి. పార్టీలో ఎవరుంటారో లేదో సంగతి పక్కనపెడితే ముఖ్యనాయకులందరిపై అనుమానాలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా తొలి నుంచి బీఆరెస్ లో లేకుండా పార్టీ అధికారంలో ఉన్నపుడు పార్టీలోకి వచ్చిన బీటీ బ్యాచ్ నాయకులను కేడర్ మరింత అనుమానంగా చూస్తున్నారు. ఎపుడు పార్టీ మారుతారో అనే చర్చ పార్టీలో సాగుతోంది. ఒకరిపై ఒకరు ఇదే అనుమానంతో చూడడంతో ఇప్పుడు ఎవరికి వారు వివరణ ఇచ్చుకోవాల్సి పరిస్థితి దాపురించింది.

అయితే కాంగ్రెస్.. కాదంటే బీజేపీ

కొందరు నాయకులు రేపోమాపో పార్టీ మారుతున్నారని, రహస్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలతో మంతనాలు జరిపారని ప్రచారం సాగుతోందీ. దీనికి ప్రధాన నాయకులు సైతం వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎవరు ఉంటారనే గ్యారంటీ లేక పోవడం ఇప్పుడు బీఆరెస్ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనంగా చెబుతున్నారు. కొందరు నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించడం, అక్రమాలు, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిపై కాంగ్రెస్ తీవ్రమైన చర్యలు తీసుకుంటుందనే అనుమానం ఉన్న నాయకులు ముందు జాగ్రత్తపడుతున్నారు. వారు కాంగ్రెస్ లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోతే బీజేపీలో చేరి రక్షణ పొందాలని భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది.

చేరేంత వరకు మేము బీఆరెస్

అసెంబ్లీ ఎన్నికల తర్వాత వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పై పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈయన బీజేపీలో చేరుతున్నారనే చర్చ సాగింది. ఈ ప్రచారం పై అప్పట్లో ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను పార్టీ మారే అవకాశం లేదన్నారు. తనకు కేసీఆర్ రెండు సార్లు ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం కల్పించారని, మూడవ సారి పోటీకి ఛాన్సిచ్చారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. వారం తిరక్కముందే రమేష్ బీజేపీతో మంతనాలు జరిపి ఆ పార్టీలో చేరిపోయారు. ఏకంగా ఆ పార్టీ ఎంపీగా పోటీచేశారు. చివరికి పార్టీ మారకుండా కేసీఆర్ రంగంలోకి దిగి బుజ్జగించినా సరేనంటూ చెప్పి తెల్లారేసరికి కండువా మార్చేశారు.

మాజీ ఎంపీ పసునూరి దయాకర్ నిన్న కేసీఆర్ తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తెల్లారేసరికి మంత్రి కొండా సురేఖతో కలిసి కాంగ్రెస్ లో చేరి బీఆరెస్ కు గట్టి ఝలక్ ఇచ్చారు. దయాకర్ కు బీఆరెస్ అనేక అవకాశాలిచ్చందనే పేరుంది. అలాంటి నాయకుడు సైతం పార్టీ మారి నాయకులను ఆశ్చర్యపరిచారు. తర్వాత మేయర్ గుండు సుధారాణి పార్టీ మారేంత వరకు గుంభనంగా వ్యవహరించారు. ముందు సీఎంను కలిసినపుడు మేయర్ హోదాలో అంటూ చెబుతూ వచ్చారు. చివరకి పార్టీ మారి అందరికి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆమెను చేర్చుకోవడంలేదనే ప్రచారం సాగినప్పటికీ ఆమె చేరిపోయారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీఆరెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం సాగినప్పుడు తీవ్రంగా ఖండించారు.

ఏకంగా తానూ, తన బిడ్డతో కలిసి కాంగ్రెస్ చేరిపోవడంతో, బిడ్డ కావ్య ఎంపీ కావడం జరిగిపోయిందీ. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బీజేపీలో చేరిపోతున్నారని ముహుర్తం కూడా ప్రకటించారు. ఈ వార్తలను ఆయన ఖండించలేదు. ఆయన బీజేపీలో చేరడాన్ని ఆ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో గత్యంతరం లేక ఆయన పార్టీ మార్పుపైన స్పందించారనేది బహిరంగ అంశంగా గుర్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు సైతం పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగింది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా బీఆరెస్ ముఖ్యనాయకులు ఎదుర్కొంటున్నారు.

వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి

పార్టీ మారుతున్నారనే ప్రచారం ఎంత జోరుగా సాగుతున్నాయో? తాను పార్టీ మారడం లేదంటూ నాయకులిచ్చే ప్రకటనలను కూడా జనం నమ్మడంలేదు. పార్టీ మారేంతవరకు ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం షరామాములు విషయంగా కొట్టిపారేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమికంటే ఇప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా మారిందంటున్నారు. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ పై విరుచుకపడిన బీఆరెస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు గొంతు తగ్గించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంటు ఎన్నికల ఓటమి పార్టీని మరింత కుంగదీస్తోందీ. ఒక్క సీటు కూడా గెలువకపోవడంతో ఆ పార్టీ నాయకులు ముఖం చాటేస్తున్నారు. కాంగ్రెస్ పై ఒంటికాలుపై లేచే నాయకులు సైతం కిమ్మనకుండా ఉన్నారు. తమ పార్టీ పరిస్థితి ఇంతగా దిగజారడం జీర్ణించుకోలేక పోతున్నారు.

మరింత కుంగదీసిన పార్లమెంటు ఎన్నిక

ఒక్క ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో రెండవ స్థానం తప్ప 14 స్థానాల్లో మూడవ స్థానానికి, హైదరాబాద్ లో నాల్గవస్థానానికి ఆ పార్టీ పడిపోయింది. ఎన్నడు ఇలాంటి పరిస్థితిని పార్టీ ఎదుర్కోలేదు. పైగా పార్టీ అధినేత కేసీఆర్ నేలపైకి దిగి బస్సుయాత్ర చేస్తే కూడా జనంలో కనీస స్పందన రాలేదంటే ఆ పార్టీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ కారణంగా నిన్నటి వరకు 39 మంది ఎమ్మెల్యేలున్నారని భావిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 35కు చేరింది. ఒకరు మృతి చెందగా ముగ్గురు చేజారారు. రానున్న రోజుల్లో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పరీక్షగా మారనుందంటున్నారు. ఇక అధికారానికి బాగా అలవాటు పడిన నాయకులు పార్టీ మారడానికి సైతం సిద్ధంకావడంలో ఆశ్చర్యం లేదంటున్నారు.

ఇప్పటికే కింది స్థాయిలో పార్టీ మారడం సాగుతూనే ఉంది. రానున్న రోజుల్లో పార్టీ నాయకులు, కేడర్ ను కాపాడుకోవడం బీఆరెస్ కు సవాల్ గా మారుతోందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందంటున్నారు. పార్టీ పై నాయకులు, కేడర్ విశ్వాసాన్ని కోల్పోవడం ఇక్కడ అత్యంత ప్రధాన అంశంగా చెబుతున్నారు. ఇప్పుడు ఆ పార్టీని ఎవరు కాపాడుతారనేది పెద్ద ప్రశ్నగా మారింది. అత్యంత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయికి చేరి పార్టీలో నమ్మకం కలిగిస్తే తప్ప ఆ పార్టీని కాపాడుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులువైన అంశం కాదంటున్నారు.

Latest News