అంతటా ఓడింది.. అహంకారమే.. ప్రజాచైతన్యంలో సంచలన మార్పు

ప్రజలు గెలిచారు. అవును.. చాలా కాలం తర్వాత. ప్రజాచైతన్యంలో ఓ గొప్ప మార్పు. దశాబ్దాల మూస ఎన్నికల ప్రక్రియను ఈసారి జనాలు బద్దలు కొట్టారు.

  • Publish Date - June 7, 2024 / 03:49 PM IST

మోదీ, కేసీఆర్, జగన్ అహానికి ప్రతినిధులు
చంద్రబాబు పరివర్తనకు, పవన్ పట్టుదలకు
సంక్షేమ పథకాలు ఇక ఓట్లు రాల్చవు

ప్రజలు గెలిచారు. అవును.. చాలా కాలం తర్వాత. ప్రజాచైతన్యంలో ఓ గొప్ప మార్పు. దశాబ్దాల మూస ఎన్నికల ప్రక్రియను ఈసారి జనాలు బద్దలు కొట్టారు. అదీ రాజకీయనాయకుల మూఢనమ్మకం మీద తెలివిగా. సంక్షేమ పథకాలు, డబ్బుల పంపకాలు, మద్యం ప్రవాహాలను దాటుకుంటూ సరిగ్గా వారి అహంమీద దెబ్బకొట్టారు. ఎప్పుడు, ఎక్కడ నెగ్గాలో ఇప్పుడు ప్రజలకు బాగా తెలుసు.

(విధాత ప్రత్యేకం)

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ఎన్నికల ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది. దాన్ని ఇన్నేళ్లు అపహాస్యం చేస్తూ వచ్చారు రాజకీయ పార్టీల నాయకులు. డబ్బు, అధికారం ఉంటే ఏ ఎన్నికలైనా సులభంగా గెలవొచ్చనే సూత్రాన్ని త్రికరణశుద్ధిగా నమ్మే రాజకీయవాదులు దశాబ్దాలుగా దాన్నే అమలుపరుస్తూ, గెలుస్తూ వస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులనే మౌలిక విషయాన్ని విస్మరించి, రాజకీయాలను వ్యాపారంగా మార్చేసారు. పెట్టుబడి – లాభం అనే వ్యాపారధోరణిని విజయవంతంగా అమలు చేయగలిగారు. దీనికి అదనంగా బీజేపీ మతాన్ని జోడించింది. ఎన్నడూ లేనంత వికృతధోరణిలో ఈ జాఢ్యాన్ని ప్రజలలో విస్తరింపజేసింది. మతమే మనల్ని కాపాడుతుందనే భరోసాతోనే నరేంద్రమోదీ, అమిత్ షా ద్వయం ఎన్నికల బరిలోకి దిగింది. కానీ, ఆ ప్రమాదంనుండి ప్రజలు తమను తాము కాపాడుకోగలిగారు.

ఎన్నికల సమయం వచ్చిన ప్రతీసారీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యలకు దిగడం బీజేపీకి బాగా అలవాటు. అందుకోసం ఏ స్థాయికైనా దిగజారగలదు. ఇక్కడ బీజేపీ అనడం కంటే మోదీ–షా ద్వయం అనడమే సబబు. అందుకు పుల్వామా ఘటన ఒక ఉదాహరణైతే, అయోధ్య రామాలయ ఆవిష్కరణ మరొకటి. రాముడ్నే ఈసారి తమ స్టార్ కాంపెయినర్గా వాడుకోదలిచిన ఈ ద్వయానికి రామబాణం గట్టిగానే తగిలింది. రెండుసార్లు దేశప్రధానిగా ఎన్నికైన మోదీని ఏం అభివృద్ధి చేసారని తటాలున అడిగితే జవాబివ్వలేడు. నిజానికి జవాబు లేదు.

మొన్నటి ఫలితాల రోజున ఇండియా కూటమి ఎన్డిఏను దీటుగా ఎదుర్కుంటూ ఎదుగుతోందని తెలియగానే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అందులోనూ అస్మదీయుడైన అదానీ షేర్లు మాత్రమే దారుణంగా నష్టపోయాయి. ఎందువల్ల? ఇంతకంటే గొప్ప రుజువేంకావాలి? ఏది అభివృద్ధి చెందిందో? ఎవరు లాభపడ్డారో? వ్యక్తిగతంగా తనకంటూ ఒక ‘థీమ్’ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్న మోదీ, దాంతో ప్రజలు, నాయకులు, అంతర్జాతీయ సమాజం దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతుడైనా, అది తాత్కాలికమేనని అయనకు తెలియలేదు.

గుజరాత్ నరమేధం వల్ల నెత్తుటితో తడిచిన ఆ చేతులు ఊపినప్పుడల్లా తనకు తప్ప అందరికీ ఇంకా ఎర్రగానే కనబడుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను చీల్చి తన ప్రభుత్వాలను నెలకొల్పిన మోదీ,షాలకు ఇప్పుడు ప్రజలు అదే గతి పట్టించారు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అనే స్థితికి తీసుకొచ్చారు.నరేంద్రమోదీ రామాలయం నిర్మించిన అయోధ్యలో నిజంగా ఓడగా, విశ్వనాథుడి కాశీలో నైతికంగా ఓడాడు. ఇప్పుడేదీ మతం? ఎందుకు ఆదుకోలేదు? ఎందుకంటే ఇప్పుడు ఆడుకున్నది ప్రజలు. ఓడగొట్టింది ప్రజలు. దేశాన్నే కీలుబొమ్మగా మార్చి ఆడుకున్న మోదీని ఇప్పుడు చంద్రబాబు, నితీశ్లు కీలుబొమ్మగా మార్చేసారు.

ఇక కేసీఆర్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఆయనలో ఓటమి ఎటువంటి మార్పు తేవడం లేదు. సాధారణంగా తను తప్పు చేయను. ప్రజలే చేస్తారనే విచిత్రవాదన ఆయన సొంతం. ఈయనా సంప్రదాయ ఎన్నికల ప్రక్రియను ఔపోసన పట్టినవాడే. ‘బంధు’లనే సంక్షేమ పథకాల పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని తగలేసి, ఒక్క ఓటూ తెచ్చుకోలేకపోయాడు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసినా ఒక్క సీటూ గెలుచుకోలేకపోయాడు. 120 అడుగుల అంబేద్కర్ కూడా ఆదుకోలేదు. అవినీతి, అక్రమాలలో నిండా మునిగినా, తనెందుకు ఓడిపోయాడో ఇంకా తెలియలేదు. బహుశా ఇక తెలియదు.ఒకవిధంగా అయన కోమాలోకి వెళ్లిపోయాడు. ఆలోచనలు స్థంభించాయి.

ఓటమి తాలూకు బాధ కూడా ఆయనను కదిలించడంలేదు. అదే ఉంటే ఫలితాల రోజు తనే ప్రెస్మీట్ పెట్టి హుందాగా ఓటమిని అంగీకరించేవాడు. శ్రేణులలో ధైర్యాన్ని, ప్రజలలో సానుభూతిని నింపగలిగేవాడు. ఈ విధంగా అపర చాణక్యుడి శకం అంతమయింది.అధికారం శాశ్వతం అనుకున్న నాయకులందిరికీ చరిత్రలో ఇదే చివరి పేజీ. బీఆరెస్ ఓడిపోవడం ఎవరినైనా బాధపెట్టిందంటే బహుశా ఒక్క కేటీఆర్నేనేమో.ఎందుకంటే కేసీఆర్ వందిమాగధులందరూ, చివరికి తన మీడియా కూడాతన ఓటమిని కోరుకున్నవారే. తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ భ్రమపడే కేసీఆర్, తన చుట్టూ ఉన్నవాళ్లలో ఎందరు వేరే పార్టీలతో టచ్లో ఉన్నారో తెలుసుకోలేదు.

ఇప్పుడు కూడా. ఎన్నికలు అయిపోయి ఫలితాలు తేటతెల్లమైపోయాయి కాబట్టి, ఉన్న పిట్టలు కూడా ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు. రెండు శాతమే ఓట్ల తేడా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్కు ఇప్పుడు వచ్చిన ఓట్లు 16శాతమే. మరి దీనికేం సమాధానం మిగిలింది? పార్టీ8 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. పాపం.. కేటీఆర్ కూడా చితి నుండి బతికొచ్చిన ఫీనిక్స్ను ఉదహరించి, శ్రేణులలతో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసాడు కానీ, తన సొంత ఈకలు తనే పీకేసుకుని, అందంగా కనబడ్డ ప్లాస్టిక్ ఈకలను అతికించుకుంటే అది ఎగరలేదు. ప్లాస్టిక్ ఈకలు ఎలాగూ ఊడిపోతాయి. ఇప్పుడెలా ఎగరాలి? ఇక మిగిలింది పార్టీని యువరక్తానికి అప్పగించి కేసీఆర్ ఫాంహౌస్కు పరిమితం కావడమే. అది మాత్రమే బీఆరెస్ ఉనికిని కాపాడగలదని ఒక ఆశ.

జగన్మోహన్ రెడ్డిది కూడా దాదాపు ఇదే కథ. కేసీఆర్ను పథకాలను కాపీ కొట్టీ, పొగరునూ కాపీ కొట్టి, ఆఖరుకు ఓటిమినీ కూడా కాపీ కొట్టాడు. అక్కాచెల్లెళ్ల ఓట్లేమయ్యాయో, అవ్వాతాతల ఓట్లెటుపోయాయోనని అయోమయానికి గురైన జగన్, అమరావతే తన అసలు శత్రువని గ్రహించలేకపోయాడు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఆవేదన చెందారో తనకు పట్టింపు లేకుండా పోయింది. నాడు ఎందరికి నవరత్నాలు పంచినా, నేడు అందరూ ఈసడించుకున్నవారే. ఓటమి సునామీలా మారిందని తెలుసుకునేలోపే ముంచేసింది.

నిజానికి విలేజ్ వలంటీర్ల పేరిట అద్భుతమైన నెట్వర్క్ ఉన్న ప్రభుత్వం జగన్‌ది. జనాల మనసులో ఏముందో తెలుసుకునే వెలుసుబాటు తనకెప్పుడూ ఉంది. కానీ, అహంకారం ఆ సమయమివ్వలేదు. మూడు రాజధానులన్నందుకు మూడు చెరువుల నీళ్లు తాగించి, అక్షరాలా భ్రష్టుపట్టించారు. ఎవరికీ రాకూడని ఓటమిని అంటగట్టారు.

ఈ ముగ్గురి కథ ఇలా ఉంటే, వ్యతిరేకంగా మరో కథ ఉంది. అది చంద్రబాబు, పవన్కళ్యాణ్లది.‘నేను’ అనే పదం మీన్నుంచి దిగని బాబును గద్దె దించి, ఇంట్లో కూర్చోబెట్టింది ప్రజలైతే, రాజకీయంగా చచ్చిపోయిన ఆయనను అమృతం పోసి, బతికించి మళ్లీ ముఖ్యమంత్రిని చేసింది పవన్కళ్యాణ్. జైలుకు వెళ్లి చంద్రబాబును పలకరించడం ప్రజలలో తనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.అ ఒక్కడి పట్టుదలే నేటి ఈ కూటమి ఘనవిజయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పట్టుదలతో సీట్లు తక్కువైనా రాజీకి సిద్ధపడ్డాడు పవన్. బీజేపీతో పొత్తుకు కూడా ఆయన తీసుకున్న చొరవే కారణం. లేకపోతే, బాబును నమ్మే స్థితిలో మోదీ లేడు.

నిజానికి పవన్కళ్యాణ్ పడ్డ కష్టం అంతాఇంతా కాదు. తన మీద జరిగినన్ని మానసిక, శారీరక దాడులు కూడా ఎవరి మీదా జరగలేదు. వాటన్నింటినీ తట్టుకుని నిలబడి ఈరోజున 100శాతం స్ట్రయిక్ రేట్తో విజయం సాధించడమంటే ఆయన పట్టుదల వల్లే. ఇప్పుడు చంద్రబాబును కంట్రోల్ చేయడం కూడా పవన్ పనే. అది చాలా ముఖ్యం కూడా. నేరుగా ప్రధానితో మాట్లాడగలిగే చొరవ ఇప్పుడు కళ్యాణ్బాబుకు ఏర్పడింది కాబట్టి, చంద్రబాబు కూడా తన పట్ల జాగ్రత్తగా ఉండాల్సివస్తుంది.

చంద్రబాబుకు ఆ సానుభూతి కూడా కలిసివచ్చింది. జగన్ను ఓడించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు కదలివచ్చారంటేనే, అందునా ఒక్క అమెరికా నుండే 2 లక్షల 60వేల మంది వచ్చారంటే ఎంతటి కసి కూడుకున్నదో అర్థమవుతోంది. పోస్టల్ బ్యాలెట్లు 90శాతానికి పైగా జాతీయ రికార్డు స్థాయిలో పోలవడం ముందే జగన్ ఓటమిని సూచించింది. ఆంధ్రప్రదేశ్ ఓట్ల సునామీలో కంటికికూడా కనబడకుండా కొట్టుకుపోయాడు.

ఇక దీన్ని నిలబెట్టుకోవడం చంద్రబాబు పని. నేను ఇదివరకటి బాబును కాదు, మారాను, మీరే చూస్తారు అని నిన్న ఎంపీల సమావేశంలో ప్రకటించాడు కూడా. ఈ పరివర్తన శాశ్వతమైతే మంచిదే. కేంద్రంలో బాబు కింగ్మేకర్ కావడం కూడా ఆంధ్రకు శుభసూచకమే. అమరావతిని బ్రహ్మాండమైన రాజధానిగా మార్చుకునే సువర్ణావకాశం ఇప్పుడు లభించింది. కానీ, మళ్లీ రోగం తిరగబెట్టి, నేనే అంటూ, పాత అలవాటు ప్రకారం పవన్కళ్యాణ్ను పక్కనబెడితే ఇక చంద్రబాబుకు కూడా కేసీఆర్ గతే.

 

Read More

Kishan Reddy | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల.. జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌..!

పార్లమెంటులో పెరగనున్న సినీ నటుల ప్రాతినిధ్యం

BJP | బీజేపీ అధిక శాతం ఓట్లను కోల్పోయిన రాష్ట్రం ఇదే..!

Kangana Ranaut| బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ చెంప చెళ్లుమ‌నిపించిన కానిస్టేబుల్..!

Latest News