Site icon vidhaatha

గులాబీ కోటపై ఫిరాయింపుల ఫిరంగులు.. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో బీఆరెస్‌ పరేషాన్‌

కాంగ్రెస్‌, బీజేపీ చెరోవైపు దాడి
కాంగ్రెస్‌ వైపు మరో 11 మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేల చూపు
వలస ఎమ్మెల్యేల రాకతో కాంగ్రెస్‌ నేతల్లో అలజడి
అసమ్మతి స్వరం వినిపించిన ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి
నీవు నేర్పిన విద్యయేనంటూ గేట్లెత్తిన కాంగ్రెస్‌
26మంది ఎమ్మెల్యేల చేరికే లక్ష్యంగా పావులు
అనర్హత వేటుతో కట్టడి గులాబీ నాయకత్వం వ్యూహం
సుప్రీం కోర్టు తలుపుతట్టనున్న బీఆరెస్‌?
నాటి ఫలితమే నేడు పునరావృతమంటున్న కాంగ్రెస్‌

విధాత: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన బీఆరెస్‌ పార్టీని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరింత పాతాళానికి పడేశాయి. అసలే వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న బీఆరెస్‌ అగ్రనాయకత్వానికి వరుసగా ఒక్కో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తున్న తీరు పార్టీ మనుగడకే సవాల్‌గా పరిణమిస్తుంది. ఫిరాయింపుల ఫిరంగు గుళ్లతో గులాబీ కోట బీఆరెస్‌ పార్టీ బీటలు వారుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్‌లో చేరడంతో మొదలైన ఫిరాయింపుల పర్వం తాజాగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరడంతో మరింత ఊపందుకుంటుంది.

లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలుచుకోలేక సున్నకు పరిమితమై ఎనిమిది చోట్ల డిపాజిట్లు కోల్పోయి, కేవలం రెండు స్థానాల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచి.. ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానం సైతం చేజార్చుకున్న బీఆరెస్‌ పార్టీకి వరుస వలసలు చావు దెబ్బను తలపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిపి అసెంబ్లీలో 39మంది సభ్యుల బీఆరెస్‌ బలాన్ని 33కు దిగజార్చుకుని ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తారోనన్న ఆందోళనతో బీఆరెస్ నాయకత్వం కలవరపడుతుంది.

పిరాయింపుల పర్వానికి తెర లేపిన హస్తం పార్టీ

సీఎం రేవంత్‌రెడ్డి సాధారణ మెజార్టీతో ఉన్న తన ప్రభుత్వ సంఖ్యా బలాన్ని పెంచుకోవడంతో పాటు రాష్ట్రంలో బీఆరెస్‌ను రాజకీయంగా చావు దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తూ గతంలో తాను పెట్టుకున్న ఫిరాయింపు ఒట్టును గట్టున పెట్టేసి వలసల గేట్లను ఎత్తి పెట్టారు. దీంతో ఒక్కొక్కరుగా బీఆరెస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో టచ్‌లోకి వస్తూ తమ కోరికల సాధనకు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం బీఆరెస్‌ నుంచి భారీగా వలసలుంటాయని కాంగ్రెస్‌ నేతలు మొదటి నుంచి చెబుతున్నప్పటికి వారిని పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు అంతే స్థాయిలో గులాబీ బాస్‌ కేసీఆర్‌, ముఖ్య నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.

అయితే పోచారం వంటి సీనియర్‌ నేత కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడిన బీఆరెస్‌ ఎమ్మెల్యేలు ఇక బీఆరెస్‌లో కొనసాగడంపై అంతర్మథనంలో పడ్డారు. పోచారం, సంజయ్‌ల బాటలోనే మరో 11మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దానం నాగేందర్‌ మరో 20మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పడం ఆసక్తికరం. గత పదేళ్ల పాలనలో అనేక అవినీతి ఆరోపణల్లో కూరుకపోయిన బీఆరెస్‌ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లుతున్న క్రమంలో బీఆరెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్లిపోతున్నారు. పోచారం, సంజయ్‌ల తర్వాతా నెక్ట్స్‌ ఫిరాయించే బీఆరెస్‌ ఎమ్మెల్యే ఎవరన్నదానిపై బీఆరెస్‌ శ్రేణులు గుబులు చెందుతున్నాయి.

బీజేపీకి బలపడకూడదనే వేగం పెంచిన కాంగ్రెస్‌

అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో సీట్లు, ఓట్ల శాతం పెంచుకుని రాజకీయంగా ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచి ఏడు స్థానాల్లో రెండో స్థానానికి ఎగబాకిన బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంపై గురి పెట్టింది. ఇందుకోసం అవసరమైన నాయకత్వం కోసం బీఆరెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీజేపీ గాలం వేస్తుంది. ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలపై, జిల్లాల్లో పట్టణ ప్రాంత ఎమ్మెల్యేలపై కాషాయ పార్టీ కన్నేసింది. చేరికల కోసం ఈడీ, ఐటీ దాడులతో బీఆరెస్‌ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవాలనే బహుముఖ వ్యూహాలను అమలు చేస్తుంది.బీఆరెస్ ఎమ్మెల్యేల చేరికల కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను పసిగట్టిన కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది.

బీఆరెస్‌ నుంచి బీజేపీలోకి ఎందరు చేరినా ఆ మేరకు ఆ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశమున్నందునా అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో సీఎం రేవంత్‌రెడ్డి ఫిరాయింపుల పర్వాన్ని వేగవంతం చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాంగ్రెస్‌కు కొత్తగా పార్టీలో చేరిన దానం నాగేందర్‌తో పాటు ఇటీవల గెలిచిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే స్థానం మినహాయిస్తే ఎక్కడా ప్రాతినిధ్యం లేకపోవడం సవాల్‌గా మారింది. అందుకే గ్రేటర్‌ ఎమ్మెల్యేలను హస్తం గూటికి చేర్చే వ్యూహానికి సీఎం రేవంత్‌రెడ్డి పదును పెడుతున్నట్లుగా తెలుస్తుంది. అదే జరిగితే త్వరలోనే గ్రేటర్‌ సహా డబుల్‌ డిజిట్‌ సంఖ్యలో బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఫిరాయింపుల కట్టడికి బీఆరెస్‌ వ్యూహం..సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన

ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరుతున్న బీఆరెస్‌ ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించే వ్యూహానికి బీఆరెస్ పదును పెడుతుంది. పార్టీ మారిన బీఆరెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని బీఆరెస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా గులాబీ వర్గాల కథనం. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి మూడు నెలలు పూర్తికావస్తుంది. దానంపై అనర్హత వేటు వేయాలంటూ అటు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆరెస్ వేసిన ఈ పిటిషన్‌పై ఈ నెల 27న వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్‌పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉంది. అలాగే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

హైకోర్టు వెంటనే దానంపై అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆరెస్ భావిస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్లే విషయమై బీఆరెస్ లీగల్ టీమ్ కసరత్తు చేస్తుంది. దానం నాగేందర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆరెస్ వ్యూహ రచన చేస్తుందని పార్టీ వర్గాల సమాచారం. అయితే గతంలో 2014, 2018అసెంబ్లీ ఎన్నికల పిదప టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను చేర్చుకున్న క్రమంలో ఆ పార్టీలు ఎదుర్కోన్న పరిస్థితినే ఇప్పుడు బీఆరెస్ ఎదుర్కోంటుంది. ఆనాడు అనర్హత వివాదంపై టీడీపీ, కాంగ్రెస్‌లు సాగించిన ప్రయత్నాలకు ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు బీఆరెస్‌కు అవే ఫలితాలుంటాయని ఇందులో పెద్దగా మార్పులేమి ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

26మంది ఎమ్మెల్యేల చేరికే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు

కాంగ్రెస్‌లో చేరబోతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు బీఆరెస్‌ నాయకత్వం లీగల్‌గా చేసే ప్రయత్నాలు ఫలించకుండా కాంగ్రెస్‌ నాయకత్వం సైతం ప్రతివ్యూహన్ని రచిస్తుంది. బీఆరెస్‌ నుంచి మొత్తం 26మంది ఎమ్మెల్యేలను హస్తం గూటికి చేర్చడం ద్వారా బీఆరెస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి లీగల్‌గా ఫిరాయింపు చట్టంతో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్‌ నాయకత్వం పావులు కదుపుతుందని సమాచారం. 2014లో టీడీఎల్పీని, 2018లో సీఎల్పీని విలీనం చేసుకుని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన కేసీఆర్‌కు బీఆరెస్‌ఎల్పీ విలీనం ద్వారా రిటర్న్‌ గిఫ్టు ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లుగా ప్రచారం వినిపిస్తుంది.

కాంగ్రెస్‌లో వలసల కలకలం

బీఆరెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కారు దిగి కాంగ్రెస్‌లో చేరిపోతున్న వైనం ఆ పార్టీలో కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం కల్గిస్తుంది. ఎన్నికల్లో తమను ఓడించిన బీఆరెస్‌ ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి దర్జాగా అధికారం వెలుగబెడుతుంటే ఇక మా పరిస్థితి ఏమిటన్న బెంగ పలువురు కాంగ్రెస్‌ నేతలను కలవరపెడుతుంది. తాజాగా బీఆరెస్‌ జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి తీవ్రంగా నిరసిస్తున్నారు. తనకు తెల్వకుండా తన నియోజకవర్గం బీఆరెస్‌ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం వినిపిస్తుంది. అయితే అసంతృప్తితో ఉన్న జీవన్‌రెడ్డిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అధిష్టానం తరుపున బుజ్జగించినా ఆయన శాంతించలేదని తెలుస్తుంది. త్వరలో మరింత మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన పక్షంలో ఈరకమైన అసమ్మతి..తిరుగుబాట్లు కాంగ్రెస్‌లో ప్రకంపనలను రేపే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

ఫిరాయింపులపై కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్ల సెటైర్లు

వలసలతో పరేషాన్‌ అవుతున్న బీఆరెస్‌ నాయకత్వం పట్ల సానుభూతి కూడా కరువవుతుంది. బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి సాగుతున్న ఫిరాయింపులపై బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పెట్టిన ట్వీట్‌ బూమ్‌రాంగ్‌ అవుతుంది. 2004- 2006 లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నామని అప్పుడు తెలంగాణ ప్రజలు తీశ్రంగా స్పందించి ఆందోళనను ఉదృతం చేయడంతో చివరకు కాంగ్రెస్‌ తలవంచవలసి వచ్చిందని గుర్తు చేశారు. అదే చరిత్ర మరోసారి పునరావృతమవుతుందని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కేటీఆర్‌ తన ట్వీట్‌లో హెచ్చరించారు. అయితే హిస్టరీ రిపీట్ అవుతుందన్న కేటీఆర్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. గతంలో బీఆరెస్‌ అధికారంలో ఉన్నప్పుడు 2014లో టీడీపీ ఎమ్మెల్యేలను, 2018లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ రెండు పార్టీల సీఎల్పీలను విలీనం చేసుకున్నప్పుడు మీకు హిస్టరీ గుర్తు రాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version