ఈ హీరో.. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి తాజా తమిళనాడు ఎలక్షన్స్ లో సత్తా చాటారు. తమిళ చలనచిత్ర పరిశ్రమలో 'దళపతి'గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆయన.. ఈ రోజు విడుదలైన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో తన పార్టీ తరఫున 100కి పైగా సీట్లు గెలుచుకొని తనకు తిరుగులేదని నిరూపించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ స్థాపించారు విజయ్. తాజాగా ఈ ఏడాది తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి రాజకీయాల్లో తన మార్క్ చూపించారు. ఈ క్రమంలోనే విజయ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనకు ఏకంగా రూ.624 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో రూ.404.58 కోట్ల చరాస్తులు, రూ.220 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టం చేశారు. అఫిడవిట్‌లో విజయ్ పేర్కొన్న వాహనాల వివరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కేవలం ఒక్క ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు ఖాతాలోనే ఆయనకు రూ.213 కోట్లకు పైగా నగదు నిల్వలు ఉండటం విశేషం. దీనితో పాటు వివిధ బ్యాంకుల్లో పదుల కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పలు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. తన కుటుంబ సభ్యులకు సైతం భారీగా రుణాలు ఇచ్చినట్లు ఆయన చూపించారు.
చెన్నైతో పాటు కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ, వాణిజ్య, నివాస స్థలాలు ఉన్నట్లు డాక్యుమెంట్లలో పొందుపరిచారు. విజయ్ భార్య సంగీత పేరు మీద రూ.15.76 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇన్ని వందల కోట్ల సామ్రాజ్యం ఉన్నప్పటికీ, విజయ్ పేరు మీద ఒక్క రూపాయి కూడా అప్పు లేకపోవడం గమనార్హం.