ఎప్పుడైనా ‘గ్రీన్ హనీ’ గురించి విన్నారా? పేరు వింటేనే ఆశ్చర్యంగా అనిపించే ఈ పచ్చ రంగు తేనె ప్రకృతిలో లభించే అత్యంత అరుదైన అద్భుతాల్లో ఒకటిగా చెప్పుకుంటారు.

దీని ప్రత్యేకత కేవలం రంగంలోనే కాదు… దొరికే విధానం, ధర, ప్రయోజనాలు అన్నీ కూడా బంగారం–వెండితో పోల్చే స్థాయిలో ఉంటాయి.

ఈ తేనెను తయారు చేసే తేనెటీగల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, అవి ప్రత్యేకమైన పచ్చ రంగు పూల నుంచి మాత్రమే రసం సేకరించడం వల్ల ఇది భాగ్యవశాత్తూ మాత్రమే దొరుకుతుంది.

గ్రీన్ హనీ ప్రధానంగా ప్రత్యేకమైన పూల నెక్టార్‌ నుంచి తయారవుతుంది. నేపాల్ హిమాలయ ప్రాంతాల్లో పెరిగే రోడోడెండ్రాన్ పూల నుంచి వచ్చే ‘మ్యాడ్ హనీ’ దీనికి ఉత్తమ ఉదాహరణ. 

ఈ తేనెలో ‘గ్రేయనోటాక్సిన్’ అనే పదార్థం ఉండటం వల్ల దీనికి లేత పచ్చ లేదా గాఢమైన గ్రీన్ టింట్ కనిపిస్తుంది. అడవి పూలు, ఖనిజాలు, పర్యావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ రంగు వస్తుంది.

అక్కడి గురుంగ్ తెగకు చెందిన వేటగాళ్లు, బాంబూ మెట్ల సహాయంతో ప్రాణాలకు తెగించి ఎక్కి ఈ తేనెను సేకరిస్తారు. ఈ ప్రక్రియ ఏడాదికి కేవలం రెండుసార్లు మాత్రమే జరుగుతుంది. 

ఒక కిలో తేనె తయారవ్వాలంటే తేనెటీగల జీవితకాలమే ఖర్చవుతుందని చెబుతారు. దీని విలువ ఎంతంటే కిలో తేనె ధర లక్షల రూపాయలకు చేరుతుంది. అందుకే దీనిని బంగారం, వెండితో పోలుస్తారు.

ఈ తేనె కేవలం తీపిగా ఉండడమే కాకుండా స్వల్ప మత్తు ప్రభావాన్ని కూడా కలిగిస్తుందని చెబుతారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నారు.