షాంపూ నురగ ఎక్కువగా వస్తేనే జుట్టు శుభ్రంగా ఉన్నట్లు ఏళ్ల తరబడి మనం బలంగా నమ్ముతున్నాం. కానీ, ఆ నురగ వెనుక ఉన్న రసాయనాలే (Sulphates) మన జుట్టును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయన్న విషయం ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.

సల్ఫేట్ షాంపూలతో ముప్పు ఉందా?..: గురుగ్రామ్‌లోని ఆర్టెమిస్ హాస్పిటల్స్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ షిఫా యాదవ్ ఇండియా టుడేకి చెప్పిన ప్రకారం, సల్ఫేట్స్ అనేవి మురికిని, ఆయిల్‌ను వేగంగా తొలగించే పవర్‌ఫుల్ క్లెన్సర్స్. ఇవి ఎక్కువగా నురగను ఇచ్చి, జుట్టును క్లీన్‌గా ఉంచుతాయి.

అందుకే బ్రాండెడ్ కంపెనీలన్నీ వీటిని వాడుతున్నాయి. కానీ ఈ సల్ఫేట్స్ అనేవి మురికి, అధిక జిడ్డుతో పాటే జుట్టుకు అవసరమైన సహజ నూనెలను కూడా పూర్తిగా తొలగించేస్తాయి. మురికితో పాటు జుట్టుకు రక్షణగా ఉండే తేమను కూడా పూర్తిగా లాగేస్తాయి.

దీనివల్ల జుట్టు డ్రైగా మారడం, చివర్లు చిట్లడం, ఊడిపోవడం లాంటి సమస్యలు మొదలవుతాయి. వెంటనే క్లీన్ అయినట్లు అనిపించినా కాలక్రమేణా జుట్టు దెబ్బతింటుంది. మానేసిన కొత్తలో ఎందుకంత కష్టం?..: అయితే ఈ కెమికల్ షాంపూలను ఒక్కసారిగా వాడటం ఆపేస్తే జుట్టులో ఎలాంటి మార్పులొస్తాయి?

దీని వెనుక ఉన్న లాజిక్‌ను భువనేశ్వర్ మణిపాల్ హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సాయి లహరి రాచమల్లు స్పష్టంగా వివరించారు. మనం రెగ్యులర్‌గా ఘాటైన షాంపూలు వాడటం వల్ల, మన స్కాల్ప్ దానికి అలవాటు పడిపోతుంది. పోయిన తేమను కవర్ చేయడానికి చర్మం ఎక్కువగా ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తుంది

అందుకే సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడటం మొదలుపెట్టిన తొలి రెండు, మూడు వారాల్లో జుట్టు జిడ్డుగా, బరువుగా అనిపిస్తుంది. పైగా నురగ తక్కువగా రావడంతో జుట్టు క్లీన్ అవ్వలేదనే ఫీలింగ్ వస్తుంది. ఇది చాలా సహజమైన మార్పు అని, దీనికి కంగారు పడాల్సిన పనిలేదని డాక్టర్స్ చెబుతున్నారు.

సడెన్‌గా పాత షాంపూని పక్కనపెట్టేయకుండా, స్మూత్‌గా మారాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మొదట్లో ఒకసారి పాతది, ఇంకోసారి కొత్త సల్ఫేట్ ఫ్రీ షాంపూని ఆల్టర్నేట్‌గా వాడాలి. అప్పుడు స్కాల్ప్ నెమ్మదిగా కొత్త దానికి అలవాటు పడుతుంది.

ఈ దశలో రోజూ తలస్నానం చేయడం తగ్గించాలి. తలకు నూనె ఉత్పత్తిని కంట్రోల్ చేసుకునే టైమ్ ఇవ్వాలి. షాంపూను సున్నితంగా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. ఒకవేళ మురికి ఎక్కువగా అనిపిస్తే, రోజూ ఘాటైన షాంపూ వాడే బదులు, నెలకు రెండుసార్లు మాత్రమే డీప్ క్లీనింగ్ షాంపూ వాడటం ఉత్తమం

మార్కెట్లో కేవలం ‘సల్ఫేట్ ఫ్రీ’ అనే లేబుల్ చూసి కొనకూడదు. అందులో సోడియం కొకాయిల్ ఐసెథియోనేట్ లాంటి సేఫ్ ఇంగ్రిడియంట్స్ ఉన్నాయో లేదో గమనించాలని డాక్టర్ లహరి సూచించారు.

జుట్టు ఆకృతిని కాకుండా స్కాల్ప్ రకాన్ని బట్టి షాంపూ ఎంచుకోవాలి. డ్రై హెయిర్ ఉన్నవాళ్లు సిరమైడ్స్, నేచురల్ ఆయిల్స్ ఉన్నవి వాడాలి. ఆయిలీ హెయిర్ ఉన్నవాళ్లు టీ ట్రీ ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి.