Alluri : అల్లూరిలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు సేఫ్

ఏపీ అల్లూరి జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు సురక్షితంగా దొరికారు. నాలుగు రోజులుగా గుహలో ఉన్న వారిని గ్రామస్తులు గుర్తించారు.

అమరావతి : ఏపీలోని అల్లూరి జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు సురక్షితంగా దొరికారు. కించూరు గ్రామ శివారు కొండ గుహపై స్థానికులు విద్యార్థినిలను గుర్తించారు. పెదబయలు ఆశ్రమం పాఠశాల నుంచి 6వ తరగతి విద్యార్థిని వసంత, 5వ తరగతి విద్యార్థిని తేజలు నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. పాఠశాల నుంచి బయటకు వచ్చిన బాలికలు ఇంటికి వెళితే తమ తల్లిదండ్రులు తిడుతారన్న భయంతో కించూరు సమీపంలో కొండగుహకు చేరుకున్నారు. నాలుగు రోజులుగా గుహ పరిసరాల్లో లభించిన కంద మూలాలు తింటూ, నీళ్లు తాగుతూ చలికి వణికిపోతూ అక్కడే ఉండిపోయారు. వసంత, తేజను గుహ వద్ద గుర్తించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అప్పటికే తమ పిల్లల కోసం గాలిస్తున్న తల్లిదండ్రులు సమాచారం అందుకుని వెంటనే గుహ వద్దకు చేరుకుని బాలికలను దగ్గర తీసుకుని వారు క్షేమంగా ఉండటంతో ఆనంద బాష్పాలు రాల్చారు. ఇటీవల అల్లూరి జిల్లాలో లంబసింగి గిరిజన పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యర్థిని గ్యాంగ్ రేప్ కు గురవ్వడం, గూడెంకొత్తవీధి మండలం రింతాడ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు వసతిగృహం నుంచి అదృశ్యమై దొరకడం వంటి ఘటనల నేపథ్యంలో బాలికల అదృశ్యం ఘటన అందరిని కలవరపెట్టింది. చివరకు వసంత, తేజలు క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.