అమరావతి: ఆంధ్రప్రదేశ్ మన్యం అడవుల్లో ఆదివాసీలు జంగ్ సైరన్ మోగించారు. అల్లూరి సీతరామరాజు జిల్లాలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీలు రోడ్డెక్కారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిర్వాసిత గ్రామాల ఆదివాసీలు భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి శనివారం అల్లూరి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. అడవిని, జీవనోపాధిని కాపాడుకోవడానికి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. “అడవి జోలికి..మా భూముల జోలికి వస్తే తరిమికొడతాం” అంటూ గర్జించారు. ఆదివాసీల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివాసీల ఆందోళనతో అల్లూరి కలెక్టరేట్ దద్దరిల్లింది.
మన్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ నెలలోనూ ఆదివాసీలు అరకులోయలో మహాగర్జన పేరుతో భారీ ఆందోళన నిర్వహించారు. ఈ ప్రాజెక్టులతో వేలాది మంది ముంపుకు గురవుతారని..వీటికి క కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏలా అనుమతిస్తున్నాయని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రశ్నించారు. గతంలో బాక్సై తవ్వకాలకు అనుమతులను ఇచ్చి గిరిజనులను నిరాశ్రయులను చేసే విధంగా వ్యవహరించిందని, గిరిజనమంతా ఐక్యంగా పోరాటం చేసి అడ్డుకున్నామన్నారు. హైడ్రో ప్రాజెక్టుకు ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామసభలు, పెసా కమిటీలతో సంబంధం లేకుండా అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. గిరిజనుల ఉనికిని, జీవనానికే ప్రమాదం చేకూర్చే హైడ్రో పవర్‌ప్రాజెక్టులకు అనుమతులివ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులకు సంబంధించిన జీవో నంబర్ 51ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులను రద్దు చేయకుంటే తిరుగుబాటు తప్పదని వారు హెచ్చరించారు.
