విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన రేపుతుంది. నిన్న కర్నూల్ వీ.కావేరి ట్రావెల్ బస్సు మంటల్లో దగ్ధమై..19మంది దుర్మరణం చెందిన ఘటన మరువక ముందే..శనివారం మరో రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి.
హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ ఓఆర్ఆర్ పై న్యూగో ట్రావెల్స్ బస్సు ఫల్టీ కొట్టింది. 20మంది ప్రయాణికులతో మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అంతకు ముందుగా ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లా కొత్తూరు జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేయబోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రెయిలింగ్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు.
