తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..ఏపీ సంజామల వద్ద వాగులో చిక్కిన బస్సు

ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో ఏపీ, తెలంగాణలలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

  • Publish Date - June 6, 2024 / 05:31 PM IST

ప్రయాణికులు సురక్షితం

విధాత : ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో ఏపీ, తెలంగాణలలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం భారీ వర్షానికి నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల వద్ద వాగు పొంగింది. వాగు వరద ఉదృతిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అయితే వరద నీటి ఉదృతి ఎక్కువయ్యే లోగానే ప్రయాణికులు బస్సు నుంచి బయటపడ్డారు. ఏపీకి వాతావరణ శాఖ 5 రోజుల వర్ష సూచన చేసింది.

ఏపీ వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో గురువారం పలుచోట్ల భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్‌, ఎస్ఆర్ నగర్, ఈఎస్ఐ, యూసఫ్‌గూడ, బోరబండ, పంజాగుట్ట, ఖైరతాబాద్, బషీర్‌బాగ్‌, కోరి, అబిడ్స్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఫిలింనగర్, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది వరదనీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి వాహనదారుల, పాదచారులు ఇబ్బంది పడ్డారు.

తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపతర ఆవర్తనంతో వర్షాలు పడుతాయని తెలిపింది. శుక్రవారం, శనివారం వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Latest News