కాంగ్రెస్ కొత్త శాసనసభాపక్ష నాయకుడిగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. దీంతో ఆయనే ముఖ్యమంత్రి కానున్నారు. మధ్యాహ్నమే ఈ మేరకు రాహుల్ సంకేతాలు ఇచ్చినా.. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ఠాక్రే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను డీకే శివకుమార్ పార్టీ పెద్దలకు తెలిపారని, వారి అభిప్రాయం మేరకు రేవంత్‌రెడ్డి సీఎల్పీ నేతగా ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు.గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఆమోదించారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి 7వ తేదీన సీఎంగా తన మంత్రివర్గంతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుగోపాల్ ప్రకటించారు. పార్టీలోని సీనియర్లందరికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు.
ఫలితాలు వెలువడిన 48 గంటల్లోనే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవడం విశేషం. అధిష్ఠానం మాటగా కాకుండా.. ఇక్కడి ఎమ్మెల్యేల మనోభావాలకు అనుగుణంగా, వారి అభిప్రాయం మేరకు రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క తదితరులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ తదితరులు అంతకు ముందు చర్చించారు. పార్టీ నిర్ణయాన్ని స్పష్టం చేశారు. అంతకు ముందు రాహుల్‌గాంధీ ఎన్డీటీవీతో మాట్లాడుతూ, తుది నిర్ణయం తీసుకున్నామని, రాహుల్‌గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రకటించారు. రేవంత్‌రెడ్డి గురువారం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు.
ఉత్తమ్, భట్టిలకు బుజ్జగింపు
గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సోమవారం నిర్వహించిన సీఎల్పీ సమావేశం సీఎల్పీ నేత, సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను హై కమాండ్‌కు అప్పగిస్తూ ఏకవ్యాఖ్య తీర్మానం చేసింది. అయితే సీఎం పదవికి తమ పేర్లను కూడా పరిశీలించాలంటూ సీనియర్ నాయకులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు తమ వర్గీయులతో కలిసి ఒత్తిడి పెంచారు. పరిశీలకులుగా వ్యవహారించిన డీకే శివకుమార్, ఇంచార్జీ మాణిక్‌రావు థాక్రేలు ఈ సమస్యను పార్టీ హైకమాండ్‌కు నివేదించారు. దీంతో పరీశీలకులతో పాటు ఉత్తమ్, భట్టిలను ఢిల్లీకి పిలిపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ. వేణుగోపాల్‌లు ఉత్తమ్, భట్టిలతో వేర్వేరుగా భేటీయై వారి అభిప్రాయలు తీసుకున్నారు.
డీకే శివకుమార్, థాక్రేలు అందించిన నివేదికలు తీసుకుని వారి అభిప్రాయలు కూడా విన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇస్తే బాగుంటుందని భావించిన ఖర్గే, రాహుల్, వేణుగోపాల్‌లు సీఎం పదవి ఆశించిన ఉత్తమ్, భట్టిలను బుజ్జగించారు. వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సాయంత్రం 6.35గంటలకు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించి సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం నిర్ణయించిందని అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారని వెల్లడించారు. ఈ ప్రకటనకు ముందు హైద్రాబాద్‌లో ఉన్న రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించారు. రాత్రికి గాని, బుధవారం ఉదయంగాని రేవంత్, ఉత్తమ్, భట్టిలను కలిపి వారి మధ్య సయోధ్య సమావేశాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాట్లు చేసింది.