ఎన్నికల కమిషన్ ప్రకటన
న్యూఢిల్లీ : అజిత్ పవార్ నాయకత్వంలోని చీలిక వర్గమే అసలైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కొంతకాలంగా అజిత్‌పవార్‌కు, ఆయన బాబాయి, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్‌కు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు తెరదించింది. పార్టీ అధినేతపై అజిత్‌పవార్ తిరుగుబాటు చేయడంతో 2023 జూలైలో ఎన్సీపీ చీలిపోయింది. అజిత్‌పవార్ వర్గం అధికార బీజేపీ- శివసేన (షిండే) వర్గంతో చేయికలిపింది. రెండు వర్గాలు ఎన్నికల చిహ్నంపై హక్కు తమదంటే తమదేనంటూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. చివరకు అజిత్ వర్గానికి అనుకూలంగా ఎన్నికల సంఘం తీర్పు చెప్పింది. పార్టీ ఎన్నికల గుర్తయిన గోడగడియారాన్ని అజిత్ వర్గానికే కేటాయించింది. దీనిపై అజిత్‌పవార్ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ.. ‘ఎన్నికల సంఘం నిర్ణయాన్ని గౌరవంగా ఆమోదిస్తున్నాం’ అని తెలిపారు.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శరద్‌పవార్ వర్గాన్ని పార్టీ పేరును నిర్ణయించుకునేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. బుధవారం సాయంత్రం 4 గంటలకల్లా మూడు పేర్లను ప్రతిపాదించాలని గడువు విధించింది. ఉభయ పక్షాల వాదనలను ఆరు నెలల వ్యవధిలో పదిసార్లు విన్న తర్వాత ఈసీ ఈ నిర్ణయం వెలువరించింది. అజిత్ వర్గం తరఫున ప్రఖ్యాత న్యాయవాదులైన ముకుల్ రోహత్గీ, నీరజ్ కౌల్, అభికల్ప్ ప్రతాప్‌సింగ్, శ్రీరంగ్‌వర్మ, దేవాన్షిసింగ్, అదిత్య కృష్ణ, యామిని సింగ్ వాదనలు వినిపించారు.