ఒడిశాలో బెడిసిన బీజేపీ, బీజేడీ పొత్తు!

  • Publish Date - March 11, 2024 / 12:47 PM IST

  • ఒంటరిగానే ఎన్నికలకు వెళతామన్న బీజేపీ స్టేట్‌ చీఫ్‌

భువనేశ్వర్‌: ఒడిశాలో బీజేడీతో పొత్తుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు కనిపిస్తున్నది. రెండు పార్టీల మధ్య చర్చల్లో పొత్తు పొడవలేదని సమాచారం. గత కొద్ది రోజులుగా బీజేపీ, బీజేడీ మధ్య పొత్తులపై చర్చలు నడుస్తున్నా.. అవి విఫలమయ్యాయని సమాచారం. తాము రాబోయే లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్‌ సామల్‌ ధృవీకరించారు. పొత్తుల కోసం బీజేడీతో చర్చల అంశాన్ని ఆయన కొట్టిపారేశారు.


తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులను, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ని చర్చల కోసం ఢిల్లీకి పిలిచింది. ఒడిశా సహా పలు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సోమవారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఒడిశా నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) సామల్‌తోపాటు మానస్‌ మొహంతి, బీజేపీ ఒడిశా ఎలక్షన్‌ ఇన్‌చార్జ్‌ విజయ్‌పాల్‌ సింగ్‌, సహ ఇన్‌చార్జ్‌ లతా ఉసెండి హాజరయ్యారు. సీట్ల కేటాయింపుపై ఈ సమావేశంలో చర్చించినట్టు సామల్‌ అనంతరం మీడియాకు తెలిపారు. ‘రాష్ట్రంలోని మొత్తం 147 అసెంబ్లీ సీట్లు, 21 లోక్‌సభ సీట్లపై చర్చలు జరిగాయి’ అని చెప్పారు. అయితే.. కూటమికి ఉన్న అవకాశాల గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. తాము మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆదివారం ఉసెండీ స్పష్టం చేయడంతోనే రెండు పార్టీల మధ్య పొత్తు ఉండటం లేదని తేలిపోయింది.


మరోవైపు బీజేపీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సైతం శనివారం ఒక ఏకవాక్య ప్రకటన వెలువరిస్తూ వదంతులు, అసత్యాలు రాజకీయాల్లో అత్యంత దరిద్రమైన అంశాలు అని పేర్కొన్నారు. మార్చి 5వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఒడిశా పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను ప్రశంసించడంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారానికి బలం చేకూరింది. అనంతరం రెండు పార్టీలు ఇదే అంశంపై వేర్వేరుగా చర్చలు జరిపాయి. తన సమావేశం అనంతరం బీజేపీ ఒక ప్రకటన చేస్తూ తమ విస్తృత ప్రయోజనాల రీత్యా సాధ్యమైనంత మేరకు కృషి చేస్తామని పేర్కొన్నది. ఒక దశలో పార్లమెంటుకు అధిక స్థానాల్లో బీజేపీ, అసెంబ్లీకి అధిక స్థానాల్లో బీజేడీ పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చినా.. ఆఖరుకు పొత్తు పొడవకుండానే ముగిసింది.

Latest News