మొస‌లి క‌డుపులో 70 నాణేలు.. నోటి ద్వారా తీసిన వైద్యులు

  • Publish Date - February 21, 2024 / 10:58 AM IST

రకరకాల నమ్మకాల కారణంగా కొందరు నీటి కొలనులు, తటాకాల్లో నాణేలు వేసి తమకు తోచినదేదో కోరుకుంటూ ఉంటారు. అమెరికాలోని ఓ జంతు ప్ర‌ద‌ర్శ‌నశాల‌లోని నీటి కొల‌నులో కూడా సంద‌ర్శ‌కులు నాణేలు వేశారు. ఆ నీటి కొల‌నులో ఉన్న మొస‌లి నాణేల‌ను మింగేసింది. అయితే ఉన్నట్టుంది మొస‌లి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో వెట‌ర్న‌రీ వైద్యులు.. దానికి స్కానింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మొస‌లి క‌డుపులో ఉన్న నాణేల‌ను చూసి వైద్యులు షాక్ అయ్యారు. అనంత‌రం ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ఆ నాణేల‌ను బ‌య‌ట‌కు తీశారు.


అమెరికాలోని నెబ్రాస్కాలో ‘ది హెన్రీ డ్రూలీ జూ అండ్ ఆక్వేరియం’ ఉంది. ఈ ఆక్వేరియంలో థిబోడాక్స్ అనే ఈ ‘లూసిస్టిక్ అలిగేటర్’ జీవిస్తోంది. దీని వ‌య‌సు 36 ఏండ్లు. అయితే ఈ మొస‌లి ఉన్న‌ట్టుండి అస్వ‌స్థ‌త‌కు గురైంది. దీంతో మొస‌లికి స్కానింగ్ నిర్వ‌హించారు. క‌డుపులో ఏవో లోహ‌పు వ‌స్తువులు ఉన్న‌ట్లు గుర్తించారు వైద్యులు. ఇక స‌ర్జ‌రీ నిర్వ‌హించి, వాటిని బ‌య‌ట‌కు తీయ‌గా, అవి నాణేలు అని తేలింది. ఒక‌ట్రెండు కాదు.. ఏకంగా 70 నాణేల‌ను మొస‌లి క‌డుపులో నుంచి తొల‌గించిన‌ట్లు వెట‌ర్న‌రీ వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం మొస‌లి కోలుకుంటుంద‌ని, దాని ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని చెప్పారు.


స‌ర్జ‌రీ ఎలా జరిగిందంటే..?

మొస‌లి థిబోడాక్స్‌కు మొద‌ట మ‌త్తు మందు ఇచ్చారు. ఆ త‌ర్వాత దాని నోట్లో ఒక ప్లాస్టిక్ పైప్ పెట్టి పూర్తిగా తెరిచారు. నాణేలను బ‌య‌ట‌కు తీయడానికి వీలుగా కొన్ని పరికరాలు కడుపులోకి పంపించారు. ఈ ప‌రిక‌రాలు పంపే కంటే ముందు.. చిన్న కెమెరాను మొసలి కడుపులోకి పంపించిన‌ట్లు డాక్ట‌ర్లు పేర్కొన్నారు. నాణేలు బ‌య‌ట‌కు తీయ‌డానికి ఈ కెమెరానే సహాయపడిందని తెలిపారు. జూకు వ‌చ్చే వారు మొస‌లి ఉండే నీటి కొల‌నులో నాణేలు వేయొద్ద‌ని నిర్వాహ‌కులు సూచించారు.

Latest News