- ఇమాంపేట ఎస్సీ రెసిడెన్షియల్లో టెన్త్ చదువుతున్న అస్మిత మృతి
- వరుస ఘటనలతో సర్వత్రా ఆందోళన
- గురుకులాల్లో ఏం జరుగుతున్నది? : ఎమ్మెల్సీ కవిత
విధాత, హైదరాబాద్ : సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని అస్మిత శనివారం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఇటీవల ఇదే గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని డీ వైష్ణవి కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగిన సాయంత్రమే ఉరివేసుకొని మరణించింది. ఈ విషయమై మృతురాలి బంధువులు విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు రాస్తారోకో, ధర్నా చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వ అధికారులు గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌ను శుక్రవారం సస్పెండ్ చేశారు. ఆ సంఘటన మరువకముందే తాజాగా అదే గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఇరుగు అస్మిత (15) శనివారం ఉరివేసుకొని మరణించింది. అస్మిత తల్లిదండ్రులు ఇరుగు ఆనంద్, జ్యోతిలది సూర్యాపేట జిల్లా మోతే మండలం బురకచర్ల గ్రామం. ఈ నెల 10న ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతి చెందడంతో మిగతా విద్యార్థులు భయపడకుండా ఉండటానికి పాఠశాల, కళాశాలకు నాలుగు రోజులు (హోం సిక్) సెలవులు ప్రకటించారు. దీంతో అస్మిత సెలవులలో హైదరాబాద్‌కు వెళ్ళింది. శనివారంతో సెలవులు అయిపోతున్నందున పాఠశాలకు వెళ్దామని చెప్పిన అస్మిత తల్లి తన పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. పాఠశాలకు వెళ్లాల్సిన రోజే అస్మిత ఉరివేసుకోవడం మిస్టరీగా మారింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గురుకులాల్లో ఏం జరుగుతుంది..ఎమ్మెల్సీ కవిత ఆందోళన
ఇటీవల భువనగిరి, సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం పట్ల బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై ట్విటర్ ఎక్స్ వేదికగా స్పందించిన కవిత సూర్యాపేట గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అవేదన వ్యక్తం చేశారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రోజుల వ్యవధిలోని అత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఎం జరుగుతోంది…? విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా అత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం గురుకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోతుందని ఆరోపించారు. తక్షణమే పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించడంతో పాటు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు.