సాయిబాబా విడుదలను ఆపలేం.. తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం

  • Publish Date - March 11, 2024 / 11:43 AM IST

  • అది ఎంతో కష్టం మీద లభించిన విడుదల
  • హైకోర్టు తీర్పు సహేతుకంగా ఉన్నది
  • దాని అమలుపై స్టే ఇవ్వలేం
  • తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాతోపాటు జర్నలిస్టు ప్రశాంత్‌ రహి, మహేశ్‌ టిక్రి, హేమ్‌ కేశ్వదత్తా మిశ్రా, విజయ్‌ నన్‌ టిక్రిని ఉపా కేసులో విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 11) నిరాకరించింది. వారి విడుదలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సహేతుకంగా ఉన్నాయని స్పష్టం చేసింది. సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం విచారణ జరిపిందని లైవ్‌ లా పేర్కొన్నది. సాయిబాబా, ఇతర నిందితులను రెండు వేర్వేరు హైకోర్టు బెంచీలు రెండుసార్లు నిర్దోషులుగా ప్రకటించిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది.


మహారాష్ట్ర తరఫున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజును ఉద్దేశించి న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ‘రెండు వేర్వేరు బెంచీలు వారిని విడుదల చేస్తూ రెండు ఉత్తర్వులు జారీ చేశాయి. వాటిని చూస్తే సహేతుకంగా ఉన్నాయి. ఇంతకు ముందు సందర్భంలో ఈ కోర్టు జోక్యం చేసుకున్నది. దానిని మేం గౌరవించాల్సి ఉన్నది. కానీ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సహేతుకంగా ఉన్నది. సాధారణంగా ఈ అప్పీలును మేం స్వీకరించలేం. విడుదల ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి’ అని కోర్టు పేర్కొన్నది. ‘ఎంతో కష్టం మీద లభించిన విడుదల ఇది. ఆ వ్యక్తి ఎన్నేళ్లు జైల్లో గడిపారు?’ అని జస్టిస్‌ మెహతా అన్నారు. అమాయకుడని చట్టం నమ్ముతున్నది. ఒకసారి విడుదల ఉత్తర్వులు వెలువడ్డాయంటే.. ఆ నమ్మకానికి బలం చేకూరినట్టు అవుతుంది’ అని జస్టిస్‌ గవాయి పేర్కొన్నారు.


90 శాతం వైకల్యంతో వీల్‌ చైర్‌కే పరిమితమైన సాయిబాబా.. ఇతరుల సహాయం లేకుండా తాను అంగుళం కూడా కదల్లేనని విడుదల అనంతరం చెప్పారు. తాను జైలు నుంచి ప్రాణాలతో బయటకు వస్తానని అనుకోలేదని తెలిపారు.

Latest News