- లోక్‌సభ అభ్యర్థిగా బీసీని ప్రకటించాలని డిమాండ్
- బీసీకే టికెట్ ఇవ్వాలని ఆ వర్గం నేతల వత్తిడి
- బీసీగా తనకే అర్హత ఉందని శాంతి కుమార్ ప్రకటన
- ఇప్పటికే నియోజకవర్గాల్లో ప్రచారం
- ఎంపీ టికెట్కు పోటీ ఉంటేనే మజా అంటున్న జితేందర్ రెడ్డి
- అధిష్ఠానం నిర్ణయం మేరకే టికెట్ అంటూ ప్రకటన
- లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై పెదవి విప్పని డీకే అరుణ
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల ముందు పాలమూరు బీజేపీలో బీసీ నినాదం అలజడి రేపుతోంది. ఇంతకాలం ఒక్కతాటిపై ఉన్న నేతలు తలో దారి వెతుక్కుంటున్నారు. ఎవరికి వారు వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించి.. తమ మనసులో మాట వెల్లడిస్తున్నారు. ఈ వాతావరణం పాలమూరు బీజేపీలో ఎన్నడూ కన్పించలేదు. బీజేపీ సీనియర్ నేతలే ఇలా చేస్తుంటే.. పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. బీజేపీలో వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యమనే సిద్ధాంతం ఉన్నా.. ఇక్కడి కొందరు నేతలు మాత్రం డోంట్ కేర్ అనే పద్ధతిలో ఉన్నారు. బీజేపీలో ఇంతవరకు టికెట్ తనకే ఇవ్వాలనే పట్టుదలతో ఏ నాయకుడు ముందుకు వెళ్ళలేదు. కానీ పాలమూరు బీజేపీలో కొత్త వొరవడి మొదలైంది. కొత్తగా కొందరు నేతలు ఒక్కసారిగా బీసీ నినాదం తెరపైకి తెచ్చారు. బీజేపీలో ఇంకెంతకాలం పదవులకు దూరంగా బీసీలు ఉండాలని ఆ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించే స్థాయికి ఇక్కడి నేతలు వచ్చారు. పార్టీ జెండాలు మోయడానికే బీసీలు పనికి వస్తారా… పదవులకు పనికిరామా? అంటూ నినదిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఈ నినాదానికి బలం చేకూరుస్తున్నారు. పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నా ఎప్పుడూ అగ్రవర్ణ నేతలే పోటీ చేస్తున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేసే అర్హత ఉన్న తనకే టికెట్ ఇవ్వాలని కొద్ది రోజుల నుంచి శాంతి కుమార్ బీజేపీ అగ్ర నేతల దృష్టికి తీసుకెళ్లారు. టికెట్ తనకే వస్తుందనే ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారు. ఊహా తెలిసినప్పటి నుంచి బీజేపీనే నమ్ముకుని సేవలు చేసానని, ఈ సారి పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వాలని ఆయన పలు సమావేశాల్లో తన అభిప్రాయం తెలుపుతున్నారు. ఇదివరకే ఆయన నారాయణ పేట, షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. బీసీ నినాదం బీజేపీలో బలంగా వినిపించేందుకే ఆయన నియోజకవర్గాల పర్యటన చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నారాయణ పేట నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఆలయాలు శుభ్రం చేసి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి తన మనసులో మాటను తెలిపి మద్దతుగా ఉండాలని కోరుతున్నారు. పాలమూరు పార్లమెంట్ స్థానం టికెట్ అధిష్టానం తనకే ఇస్తుందని, పార్టీ క్యాడర్ తనవైపే ఉన్నారని శాంతి కుమార్ అంటున్నారు.
టికెట్ కోసం పోటీ ఉంటేనే మజా..
టికెట్ కోసం పోటీ ఉంటేనే మజా ఉంటుందనే ధోరణిలో మాజీ ఎంపీ, ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్ ఆశించే నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. పాలమూరు పార్లమెంట్ స్థానం టికెట్ తనకే వస్తుందని అనుకునే స్థాయి బీజేపీలో ఉండదని, అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వాలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయంలో ఆయన ఉన్నారు. టికెట్ కోసం ఎవరి ప్రయత్నం వారిది అని, చివరకు అధిష్టానం నిర్ణయం పైనల్ అవుతుందనే మాటలు జితేందర్ రెడ్డి ప్రతి సమావేశంలో అంటున్నారు. తనకు కూడా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పరిచయాలు ఉన్నాయని, అంతమాత్రాన టికెట్ తనకే వస్తుందనే ఆశలు ఉండవని, బీజేపీలో ఎవరు ఎంత క్లోజ్ గా ఉన్నా టికెట్ విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే నడుచుకోవాల్సి ఉంటుందని జితేందర్ రెడ్డి పేర్కొంటున్నారు. క్రమశిక్షణ ఉన్న బీజేపీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తారు కానీ పదవుల కోసం పనిచేయరని, పదవి కంటే పార్టీ, ప్రజలు ముఖ్యమనే మాటలు ఈ మధ్య పలు సందర్బాల్లో ఆయన ప్రకటించారు. పాలమూరు పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు తన ప్రయత్నం తాను చేస్తున్నానని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.
అంతుచిక్కని డీకే అరుణ వ్యూహం
మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇప్పటివరకు పాలమూరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తాననే మాట పెదవి దాటలేదు. కానీ.. పాలమూరులో ఈ మధ్య ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినా పార్టీ అభివృద్ధి పైనే మాటలు వస్తున్నాయి కానీ పోటీ చేస్తాననే విషయం చెప్పడం లేదు. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంతో ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదనే వాదన కూడా ఇక్కడ వినిపిస్తున్నది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నా ఆమె మనసులో మాట బయట పెట్టడం లేదు.
కాంగ్రెస్ సెగ్మెంట్లలో బీజేపీ పుంజుకుంటుందా?
బీజేపీ టికెట్ ఆశించే నేతలు మోడీ చరిష్మాతో గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. పాలమూరు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా, బీజేపీ నేతలు మాత్రం ఎంపీ ఎన్నికల్లో ప్రజలు మావైపు ఉన్నారనే విషయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట, కొడంగల్, జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ స్థానంలోకి వస్తాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ కు తప్పా మరో పార్టీకి ఓటు వేస్తారనే నమ్మకం లేదు. మరి ఏ నమ్మకంతో బీజేపీ నేతలు ఇక్కడ గెలుస్తామనే ధోరణిలో ఉన్నారో వారికే తెలియాలి.