విధాత: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు, బీఆర్‌ఎస్ అసంతృప్త నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులపై బీఆర్‌ఎస్ బహిష్కరణ వేటు వేసింది. వైరా నియోజకవర్గంలో 20 మంది నాయకులపై చర్యలు చేపట్టింది. రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.
వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్, మరికొందరిని సస్పెండ్ చేసింది. ఇవాళ ఉదయం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు పలువురు ముఖ్యనేతలు ఆయనతో సమావేశమయ్యారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిష్కరణ అస్త్రాలను సంధించింది.
నెలరోజులుగా ఆయన ఆత్మీయ సమావేశాలు, అంతర్గత భేటీలు నిర్వహిస్తున్నారు. అధికారపార్టీపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకే కాదు, తనను నమ్ముకున్న వాళ్లు ఏమీ చేయలేదు. పదవులు ఇవ్వకున్నా పరవాలేదు, ప్రతి మనిషిక ఆత్మగౌరవం ఉంటుందన్నారు.
ఇక్కడ ప్రభుత్వం రెండు మూడు నెలలు ఉంటుంది. ఈ రెండు మూడు నెలల్లో మనల్ని ఇంకా ఇబ్బంది పెడుతారు. ఇంకా చాలామంది మా శ్రేయోభిలాషులు ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. కానీ పొద్దుగూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందన్నారు. గతంలో మమ్మల్ని నమ్ముకుని ఉన్నవాళ్లను ఇబ్బందులు పెట్టినా ఉపేక్షించాం.
కానీ రాబోయే రోజుల్లో తనను గాని, కనకయ్యనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు ఎక్కడైనా ఏ వ్యక్తినైనా పోలీసులైనా, రెవెన్యూ అధికారులైనా, చివరికి అధికారమదంతో, అహంకారంతో ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటున్నవాళ్లు అన్యాయంగా, అక్రమంగా ఇబ్బందులు పెడితే ఎలా మూల్యం చెల్లించాలో మాకు తెలుసని హెచ్చరించిన సంగతి తెలిసిందే.