Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో..? ఎవరు ఏ పార్టీలో చేరుతున్నారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే టికెట్లు, ఇతర పదవులు దక్కని అగ్ర నాయకులు.. ఇతర పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.
శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు, మాదాపూర్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్ గౌడ్, హాఫిజ్‌పేట్ డివిజన్ కార్పొరేటర్, ఆయన భార్య పూజిత గులాబీ పార్టీకి వీడ్కోలు పలకనున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సమక్షంలో జగదీశ్వర్ గౌడ్, పూజిత హస్తం గూటికి చేరనున్నారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్ అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆహ్వానం మేరకు జగదీశ్వర్ గౌడ్ దంపతులు హస్తం గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ జగదీశ్వర్ గౌడ్‌కు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడంతో, ఆయన బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది.
జగదీశ్వర్ గౌడ్ మాదాపూర్ డివిజన్ నుంచి, పూజిత హాఫీజ్‌పేట్ నుంచి రెండు పర్యాయాలుగా కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. గతంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉంటారన్న ప్రచారం జరిగినా చివరి నిమిషంలో కేటీఆర్ బుజ్జగించడంతో ఆయన వెనక్కి తగ్గారన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ సారికూడా అరెకపూడి గాంధీకే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో, జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.