విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిట్ బృందం ముందు శుక్రవారం విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి టి.హరీష్ రావు సహా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్ నుండి కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వారందరిని పోలీస్ స్టేషన్ ముందే అడ్డుకున్న పోలీసులు కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఈ సందర్బంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట నెలకొని ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమివేశారు.
పోలీసుల తమపై దౌర్జన్యాన్ని చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, క్రాంతి కిరణ్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. వారిని కూడా పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
కేసులతో రేవంత్ సర్కార్ రాజకీయ డ్రామా : కేటీఆర్
సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను మేం నిలదీస్తుండటాన్ని తట్టుకోలేక కేసులు, విచారణల పేరుతో డ్రామాలు, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలతో రాష్ట్రం కోసం సుదీర్ఘంగా కొట్లాట చేశామని, 10ఏండ్లలో రాష్ట్రం కోసం ఎంతో పనిచేశామని, మేము ఎన్నడు టైం పాస్ రాజకీయాలు చెయ్యలేదు అన్నారు. కాని రేవంత్ రెడ్డి మాత్రం ఇచ్చిన హామీలు పక్కకు వెళ్లిపోగా.. కేసులతో టైమ్ పాస్ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. పిచ్చోడి చేతిలో రాయిలా ఈరోజు రాష్ట్రం ఉందని, పుట్టిన మట్టి సాక్షిగా నేను ఎటువంటి అక్రమ పనులు నేను చేయలేదు అన్నారు. గత ఏడెనిమిది ఏళ్లుగా నా మీద తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వ హననం) జరుగుతోందని, నన్ను ఏదో డ్రగ్స్ కేసుల్లోనో, హీరోయిన్లతో సంబంధాలనో ఇరికించాలని చూశారు. నన్నే కాకుండా నా కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అయినా నేను ఎవరికీ భయపడలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నన్ను విచారణకు పిలిచారు. నేను వెళ్తాను. నేను అడుగుతాను అన్నారు. మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందో, అసలు ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళు సమాధానం చెప్పాలి అన్నారు.
గత రెండేళ్లుగా ఒక సీరియల్ లాగా లీకులు ఇస్తూ నా మీద వ్యక్తిత్వ హననం చేస్తున్న వారు ఎవరో నేను అడుగుతాను అని, మరి నా పరువుకు, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసువోళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? అని నేను అడుగుతానన్నారు. అట్లే ఇంకో మాట కూడా నేను అడుగుతా ఇవాళ. ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి… ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా? అని ప్రశ్నించారు. కెమెరా ముందుకు వచ్చి చెప్పే ఒక్క పోలీసువోడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జనార్ ముందుకు వస్తాడా? అని కేటీఆర్ సవాల్ చేశారు. 2015లో ఏ దొంగనైతే మా ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నించి 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిండో ఆ దొంగ నేడు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు అని, మిగతా పార్టీ వాళ్లను కూడా ఆయన మాదిరిగానే బద్నామ్ చేయాలని చూస్తున్నాడన్నారు. నైనీ బొగ్గు బ్లాక్ లో రేవంత్ రెడ్డి బావమర్ది, మంత్రుల అక్రమాలను హరీష్ రావు బయటపెట్టగానే కేసులు, విచారణల పేరుతో మమ్మల్ని వేధిస్తున్నారన్నారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నందునా కేంద్ర బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్నారు. ముమ్మాటికి ఒక్కటి మాత్రం పక్కా అని రేవంత్ రెడ్డి ఆదేశాలలో మాపై కేసులు, విచారణలో వేధించే పోలీసులను నేను కూడా వదిలిపెట్టను అని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, విచారణలకు హాజరవుతామని, ప్రభుత్వాన్ని ఎన్నికల హామీలపైన, అక్రమాలపైన ప్రశ్నిస్తునే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
