విధాత, హైదరాబాద్ : బాసర నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక ‘దేవాలయ సర్క్యూట్’ అభివృద్ధి చేయాలని గోదావరి పుష్కరాల నిర్వహణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ నిర్ణయించింది. గోదావరి పరివాహక ప్రాంతంలోని పురాతన ఆలయాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ మాస్టర్ ప్లాన్ తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల అభివృద్ది, వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం డా. బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన గోదావరి పుష్కరాల కేబినెట్ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కొనసాగింది. భేటీలో సహచర మంత్రులు, ఆయా శాఖల అధికారులతో ఆయా అంశాలపై చర్చించారు.
గోదావరి పుష్కరాల నేపధ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. బాసర ఆలయానికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఆమోదం ఉన్నందున, భద్రాచలం దేవస్ధానం మాస్టర్ ప్లాన్ ను కూడా కమిటీలో చర్చించి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకోవాలని నిర్ణయించారు. గోదావరి పుష్కరాలను నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి సమగ్ర రోడ్ల అనుసంధానం కల్పించే విధంగా, ముఖ్యంగా గోదావరి పుష్కరాలకు విచ్చేసే భక్తులకు మెరుగైన వసతుల ఏర్పాట్లతో పాటు పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారి సౌకర్యాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణ ఇతర సౌకర్యాల కల్పనపై తీసుకోవాల్సిన చర్యలను గురించి సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని సబ్ కమిటీ సూచించింది. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల విస్తరణకు నిధుల అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. ఆధ్యాత్మిక వైభవంతో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.
సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Lavanya Tripathi | లావణ్య త్రిపాఠిని కూడా వేధిస్తున్నారా .. తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిందా?
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఊరట
