Telangana Temple Circuit : తెలంగాణలో టెంపుల్ సర్క్యూట్…బాసర నుంచి భద్రాచలం వరకు

బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పుణ్యక్షేత్రాలను కలుపుతూ తెలంగాణలో భారీ 'టెంపుల్ సర్క్యూట్' ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

Telangana Temple Circuit : తెలంగాణలో టెంపుల్ సర్క్యూట్…బాసర నుంచి భద్రాచలం వరకు

విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధుల సూచనలను పరిశీలనలోకి తీసుకుని ఈ టెంపుల్ సర్క్యూట్ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో శతాబ్దాల కాలం నాటి అతి పురాతన దేవాలయాలతోపాటు, ప్రత్యేకతను, ఖ్యాతిని సంతరించుకున్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కృష్టా, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ దేవాలయాలు ఎన్నో ఏళ్ళుగా కొలువుతీరి భక్తుల, పర్యాటకుల ఆత్మీయ ఆదరణను పొందుతున్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించి ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నప్పటికీ వీటిని సమాహారంగా తీర్చిదిద్దుతూ ఆసక్తి ఉన్నవారికి దర్శనీయస్థలాలుగా ఒకే పర్యటనలో అందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. దీని వల్ల ఆయా ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందనున్నాయి. దీని వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. దీంతో కొంత మందికి జీవనోపాధి లభించనున్నది.

బాసర నుంచి భద్రాచలం వరకు

రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గుడులున్న ఈ ప్రాంతాలన్నింటిని కలిపే విధంగా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో అడుగుపెట్టగానే ఉండే బాసర నుండి భద్రాచలం వరకు ఉండే ఈ జిల్లాలలో ఉన్న ప్రధానమైన దేవాలయాలన్నింటిని పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఒక టెంపుల్ సర్క్యూట్ గా ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. దీని వల్ల రాష్ట్రం నుండి వచ్చే భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు కూడా టెంపుల్ సర్క్యూట్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు టెంపుల్ సర్క్యూట్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ఆధ్వర్యంలో డీపీఆర్ తయారు చేసి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించి ఎంత ఖర్చు అవసరమైనా వెనుకాడకుండా పూర్తి చేయాలని యోచిస్తోంది. ఈ పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా జిల్లాలలో ఉండే ప్రజా ప్రతినిధులతో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల భాగస్వామ్యంతో దీనికి రూపకల్పన చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ టెంపుల్ సర్క్యూట్ కు సంబంధించిన డీపీఆర్ ను రూపొందించడానికి రానన్న ఎకో టూరిజంగా ఉన్న అనేక అటవీ ప్రాంతాలను కలుపుతూ ఈ ప్రాజెక్టును రూపొందించాలని భావిస్తున్నారు. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శనీయ ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నారు. టూరిస్టులు ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఉండే విధంగా తెలంగాణలోని దైవ క్షేత్రాలను ఒకే మార్గంలోకి తీసుకువచ్చి అభివృద్ధి చేసేవిధం గా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

త్వరలో ఆమలులోకి ప్రాజెక్టు: పొంగులేటి

ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయాలకు సంబంధించిన అనుసంధానాన్ని చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరంగల్ భద్రకాళి ఆలయ ప్రాంగణం లో కొనసాగుతున్న మాడ వీధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి భద్రకాళి ఆలయాన్ని మహా అద్భుతంగా తీర్చి దిద్దాలని శాస్త్ర యుక్తంగా భద్రకాళి ఆలయానికి మరింత వన్నె తెచ్చే విధంగా అభివృద్ధి చేయడం, మాడ వీధులతో పాటు అంతర్గత పనులను ప్రభుత్వం చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు అంశాన్ని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేం నరేందర్ రెడ్డి, లోక్ సభ సభ్యురాలు డా.కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ లు స్నేహ శబరీష్, డా.సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Skin Care | చలికాలంలో చర్మం పొడిబారుతుందా..? ఈ జాగ్రత్తలు పాటించండి.. స్కిన్‌ని కాపాడుకోండి
Budget 2026 | కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 1నే ఎందుకు..? ఎప్పుడు మార్చారు..?