Naini vs Dasyam | భద్రకాళీ సాక్షిగా ‘రాజకీయం’.. మాడ వీధుల ఏర్పాటుపై కిరికిరి

Naini vs Dasyam | వరంగల్ లోని ప్రఖ్యాత భద్రకాళీ దేవాలయ పురోభివృద్ధికి రాజకీయ విభేదాలు పీటముడి వేశాయి. భద్రకాళీ దేవాలయ అభివృద్ధిలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వహయంలో ప్రతిపాదించిన మాడ వీధుల ఏర్పాటు అంశం ఇప్పుడు కిరికిరిగా మారింది.

పశ్చిమలో నాయిని వర్సెస్ దాస్యం
గుడిసెల తొలగింపుపై అభ్యంతరం

Naini vs Dasyam | విధాత, ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ లోని ప్రఖ్యాత భద్రకాళీ దేవాలయ పురోభివృద్ధికి రాజకీయ విభేదాలు పీటముడి వేశాయి. భద్రకాళీ దేవాలయ అభివృద్ధిలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వహయంలో ప్రతిపాదించిన మాడ వీధుల ఏర్పాటు అంశం ఇప్పుడు కిరికిరిగా మారింది. మాడ వీధుల ఏర్పాటుకు చేపట్టనున్న విస్తరణ, అభివృద్ధి పనుల ప్రతిపాదన పనులు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మధ్య ఉన్న రాజకీయ విభేదాలను మరోసారి రచ్చకెక్కించాయి. పరస్పర విమర్శలు, రాజకీయ సవాళ్ళకు వేదికగా మారింది. ఈ క్రమంలో చెరబండరాజు నగర్ గుడిసెవాసులు రోడ్డున పడ్డారు. ఈ నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపెట్టకుండా ప్రభుత్వం గుడిసెలు తొలగించారని వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ ప్రతిపాదిననే ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేస్తున్నారు.

పేదల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్టగొడుతోందని చెరబండ రాజుల కాలనీవాసుల సమస్య పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయనమీడియా తో మాట్లాడారు. అధికారం ఉంది కదా అని అభాగ్యులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. దళితులు గుడిసెలు వేసుకొని ఉండడం తప్పా అంటూ ప్రశ్నించారు. పేదలకు నీళ్లు కట్ చేయిస్తూ… కరెంట్ కట్ కాలేదా… ఇల్లు కూల్చుతామని బెదిరిస్తున్నారు. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్ దగ్గరకు వెళ్లామన్నారు. నాయిని వెకిలిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

వినయ్ హ‌యాంలోనే ప్రతిపాదన: నాయిని

భద్రకాళి మాడ వీధుల అభివృద్ధిలో భాగంగా, ఆలయ ప్రాంగణంలో ఉన్న దళితుల గుడిసెల తొలగించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే వినయ భాస్కర్ చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ గుడిసెల ప్రక్రియ ప్రారంభించింది మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయం కాపీలు విడుదల చేశారు. భద్రకాళి మాడవీధుల్లో ఉన్న దళిత కుటుంబాలు నష్టపోకుండా వారికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వారి కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ఇలాంటి విధానాలకు పాల్పడడం సరైందికాదన్నారు.

Latest News