బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా !: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ పేరు మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంచలన సూచన ఇచ్చిన కేటీఆర్, కాంగ్రెస్-బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి అవినీతి, 2027 పాదయాత్ర ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి.
బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ పేరు మార్పుపై మాట్లాడుతున్న కేటీఆర్
Back to TRS? KTR Hints at Major Rebranding After BRS Setback
- 🔴 బీఆర్ఎస్ పేరు మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చే సంకేతాలు
- 🔴 బీఆర్ఎస్ మార్పుతో పార్టీ నష్టపోయిందని కేటీఆర్ అంగీకారం
- 🔴 సింగరేణి కుంభకోణంపై కాంగ్రెస్-బీజేపీపై ఘాటు ఆరోపణలు
- 🔴 2027లో పాదయాత్ర ప్రకటించిన కేటీఆర్
విధాత, మంచిర్యాల:
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ పెద్ద చర్చకు తెరలేపే వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చే ఆలోచన ఉందని చెప్పడం, బీఆర్ఎస్ పేరుతో నష్టపోయామని అంగీకరించడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ సింగరేణి అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. 2027లో పాదయాత్ర చేస్తానని ప్రకటించడం కూడా రాజకీయ వేడి పెంచుతోంది.
బీజేపీ-కాంగ్రెస్ ఇద్దరూ తోడు దొంగలే!
బీఆర్ఎస్ పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చే అవకాశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత పార్టీ ప్రజలకు దూరమైందని, అదే ఓటమికి ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు. పదేళ్ల పాలనలో ప్రజలతో గ్యాప్ పెరగడం వల్లే ఎన్నికల్లో పరాజయం ఎదురైందని స్పష్టం చేశారు. ఇకపై ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా 2027లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని, బీజేపీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.
బీజేపీ ఎంపీలకు రేవంత్, రేవంత్ బామ్మర్దికి బీజేపీ టెండర్లు కట్టబెడుతూ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని, రేవంత్ తన బామ్మర్దితో కలిసి సింగరేణిని కొల్లగొడుతుంటే..బీజేపీ అడ్డుకోకుండా రేవంత్‌ను కాపాడుతోందని కేటీఆర్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అవినీతిపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కేవలం మాటలు చెబుతున్నారు తప్ప విచారణ జరిపించడం లేదు అన్నారు. సింగరేణి సంపదను కాపాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కడాలేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ తెచ్చి..ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి వేల కోట్ల సింగరేణి సంపదను కొల్లగొడుతున్నారు అని కేటీఆర్ ఆరోపించారు.సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ తో టెండర్లు వేసిన వాళ్ళని బ్లాక్ మెయిల్ కి గురి చేసి బెదిరింపులకు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు దిగుతున్నారని ఆరోపిచారు నీకు దమ్ముంటే నీ బామ్మర్దిపై సిట్, ఏసీబీ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “దోచుకో-దాచుకో” అనే పథకం
కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ‘దాచుకో-దోచుకో’ అన్న పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా నడిపిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. అవినీతి దుకాణం తెరిచి అడ్డగోలుగా వసూళ్లకు దిగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి పథకంలో స్వయంగా మంత్రుల నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన ‘దాచుకో-దోచుకో-దాచుకో’ పథకం సింగరేణిలోనూ నడుస్తోంది. సింగరేణిలో సృజన్ రెడ్డి అరాచకాలను బయట పెడితే సీఎం, డిప్యూటీ సీఎంలు ఇప్పటిదాకా ఆ వేల కోట్ల కుంభకోణం పై మాట్లాడలేదని, గా గతంలో కేసీఆర్ ఇచ్చిన 16 వేల వారసత్వ ఉద్యోగాల పైన విచారణ జరిపిస్తామని సింగరేణి ఉద్యోగులను భయపెడుతున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాల పైన ఏసీబీ విజిలెన్స్ విచారణ కాదు జరిపించాల్సింది, సృజన్ రెడ్డి అక్రమాల పైన సింగరేణి కుంభకోణం పైన విచారణ జరిపించాలన్నారు.
ప్రతి బొగ్గు గనిలో మళ్ళీ అగ్గి పుట్టిస్తాం,
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి ఉద్యోగాలు వెంటనే కల్పించాలి. లేకుంటే బిఆర్ఎస్ తరపున సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సింగరేణి కార్మికుల కోసం ప్రతి బొగ్గు గనిలో మళ్ళీ అగ్గి పుట్టిస్తాం, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టం. సింగరేణికి అనేక సమస్యలు ఉన్నాయి. అయితే సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మమ్మల్ని పోరాటం చేయమని అడుగుతున్నారు. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయాలి. సింగరేణి కార్మికులకు అండగా మా పార్టీ నిలబడుతుంది, సింగరేణి కార్మికుల తరపున బరాబర్ కొట్లాడుతాం. మాతో కలిసి రండి, రానున్న సింగరేణి ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గెలిపించుకుందాం అని కోరారు.
30నెలలైన హామీల అమలు ఎక్కడా?
100 రోజుల్లో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదు అని కేటీఆర్ విమర్శించారు. రైతుల నుంచి ఆడబిడ్డల దాకా, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అందరికీ తీవ్రమైన మోసానికి కాంగ్రెస్ పార్టీ గురి చేసింది. ‘మూడు నెలల్లో పిల్లలు పుడతారా’ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, 30 నెలలు అయింది ఎందుకు గ్యారెంటీలు అమలు చేయలేదో అని మనం అడగాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు సూచించారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పునిస్తే…మంత్రి వివేక్ అధికార మదంతో కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి, పోలీసులను అడ్డంపెట్టుకొని అడ్డమైన కేసులు పెట్టించి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను జైలుకు పంపిండన్నారు. 51 రోజులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా..మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రజాస్వామ్య వ్యవస్థను గెలిపించారు అని అభినందించారు. వారందరికి కేటీఆర్ సన్మానం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram