వారసుల పాదయాత్ర పర్వం.. ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ !

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీఎంల రాజకీయ వారసులు అధికార సాధన కోసం పాదయాత్రల ట్రెండ్ ఫాలో కానుండం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఏపీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ పాదయాత్ర ప్రకటన చేయగా.. తెలంగాణలో బీఆర్ఎస్ వర్కిం్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేను కూడా పాదయాత్ర చేయబోతున్నట్లుగా ప్రకటించడం ఆసక్తికరం.

వారసుల పాదయాత్ర పర్వం.. ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ !

విధాత, హైదరాబాద్ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీఎంల రాజకీయ వారసులు అధికార సాధన కోసం పాదయాత్రల ట్రెండ్ ఫాలో కానుండం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఏపీలో ప్రజాప్రస్థానం పాదయాత్రతో దివంగత వైఎస్సార్ అధికారంలోకి వచ్చి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజన పిదప ఏపీలో చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా వైఎస్సార్ వారసుడు, వైసీపీ అధినేత వైఎస్.జగన్ సైతం పాదయాత్ర చేసి అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఘన విజయంతో సీఎంగా పగ్గాలు చేపట్టి ఐదేళ్లు ఏపీని పాలించాడు.

అనంతరం ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు తరుపునా టీడీపీ నుంచి యువగళం పేరుతో ఆయన కుమారుడు నారా లోకేశ్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. యువగళం పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలోనే జగన్ ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబును పలు కేసుల పాలు చేసి జైల్లో పెట్టడం సంచలనంగా మారింది.  ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. వైసీపీ ఘోర ఓటమిపాలయ్యింది.  ఇకపోతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం గమనార్హం.

మళ్లీ వైఎస్. జగన్ పాదయాత్ర ప్రకటన

ఇప్పుడు ఏపీలో మళ్లీ అధికార సాధన ప్రయత్నాల్లో భాగంగా 2027 చివరి నుంచి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్లుగా జగన్ తాజాగా ప్రకటించాడు. వచ్చే ఏడాది చివరిలో నా పాదయాత్ర ఉంటుందని..ఒకటిన్నర సంవత్సరం పాటు పాదయాత్రలో పత్రి ఊరు తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతానని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ ప్రకటించారు. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్‌సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ కేటీఆర్ పాదయాత్ర

ఏపీలో వైఎస్. జగన్ మరోసారి పాదయాత్ర ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వారసుడైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేను కూడా తెలంగాణలో 2027లో పాదయాత్ర చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఎప్పటి నుంచో పాదయాత్ర చేయాలనుకుంటున్న కేటీఆర్ మరోసారి తన మనసులోని మాటను బహిర్గతం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి.. పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లకు పడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ సాధించేందుకు..కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను, అవినీతిని ప్రజల్లో ఎండగట్టి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకవచ్చేందుకు పాదయాత్ర సరైన మార్గంగా కేటీఆర్ తలపోస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో తనకు ప్రధాన పోటీదారుగా ఉన్న బావ హరీశ్ రావుకు ధీటుగా ఆధిపత్యాన్ని చాటుకునే క్రమంలో సొంత ఇమేజ్ పెంచుకునేందుకు పాదయాత్ర సాధనంగా మారతుందని ఆయన భావిస్తున్నట్లుగా కనబడుతుంది.

నిజానికి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో కేసీఆర్ రాజకీయ వారసుడిగా ఉన్న కేటీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం జైలుకు పంపిస్తారని అంతా భావించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనలోని అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను జైలుకు పంపిస్తామని రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఓ రకంగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనను జైలుకు పంపించినందుకు ప్రతికారం తీర్చుకుంటారని అంతా అనుకున్నారు.

రేవంత్ జైలుకు పంపడు..పాదయాత్రనే ఇమేజ్ మార్గమా?

బీఆర్ఎస్ హయాంలోని అవినీతి అక్రమాల కేసుల్లో కేటీఆర్ ను లేదా కేసీఆర్, హరీశ్ రావులను జైలుకు పంపితే వారికి లేనిపోని ఇమేజ్ ను మనమే పెంచినట్లవుతుందన్న ఆలోచనతో రేవంత్ ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకే కాళేశ్వరం అవినీతి, ఫార్మాలా ఈ కారు రేసు, పోన్ ట్యాపింగ్ కేసు, గొర్రెల స్కామ్, సీఎంఆర్ఎఫ్ అవతవకలు, టూరిజం స్కామ్, ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ స్కామ్, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ ఫ్లాంట్లు నిర్మాణాల అవినీతి అంశాలతో పాటు, తాజాగా అసెంబ్లీలో ప్రకటించిన మైనింగ్ స్కామ్ వంటి వాటిపై కేవలం విచారణలకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిపెట్టుకుంటుందన్న వాదన వినిపిస్తుంది.

ఎలాగు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి కేసులను తేల్చకుండా రాజకీయంగా బీఆర్ఎస్ పై ఎదురుదాడికి ప్రచారాస్త్రాలుగా సమయానుకూలంగా వినియోగిస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీల వైఫల్యాలు, అవినీతి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో గెలుపుకు పాదయాత్ర మంచి మార్గమని కేటీఆర్ భావిస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మొత్తం మీద వచ్చే ఏడాది చివరిలో తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష నేతల రాజకీయ పాదయాత్రల సందడి ఆరంభం కావడం ఖాయంగా కనిపిస్తుండగా..అధికార పీఠానికి మార్గాలుగా వారి పాదయాత్రలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయన్నది మునుముందు తేలనుంది. వారి పాదయాత్రలు మరోసారి ఆ పార్టీలను అందలం ఎక్కిస్తాయా ? లేక కాంగ్రెస్ లో గాంధీ కుటుంబం రాజకీయ వారసుడైన రాహుల్ గాంధీ జోడో యాత్ర తరహాలో మిగిలిపోతాయా ? అన్నది చూడాలి.  అలాగే ప్రతిపక్ష నేతలు జగన్, కేటీఆర్ ల పాదయాత్రల అస్త్రాలను ఏపీ, తెలంగాణలో అధికార టీడీపీ, కాంగ్రెస్ లు ఏ విధంగా ఎదుర్కోంటాయన్నది వేచి చూడాల్సి ఉంది.